Yerranaidu Park Tekkali Srikakulam Disrtict : చిన్నారులు ఆడుకోవడానికి, పట్టణవాసులు ఆహ్లాదం పొందడానికి, వ్యాయామం కోసం వెళ్లే స్థలం పార్కు(Park). కానీ, అలాంటి పార్కులు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఒకప్పుడు ఆహ్లాదానికి ఆనవాళ్లుగా ఉండే ఉద్యానవనాల, పార్కుల నిర్వహణను అధికారులు గాలికి వదిలేయడంతో ముళ్లపొదలు పెరిగి అవి అడవిని తలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉండే ఎర్రన్నాయుడు పార్క్ (Yerranaidu Park)దుస్థితి ఇది. నాలుగేళ్ల ముందు పచ్చని చెట్లతో కలకల్లాడే ఈ పార్కు ఆధ్వానంగా మారి నిరుపయోగంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
ప్రభుత్వం మారింది.. నెల్లూరు సిటీ పార్క్ మూతపడింది
Yerranaidu Childrens Park Poor Condition : శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో ఉన్న ఎర్రన్నాయుడు పార్కును 2018లో గత ప్రభుత్వం 50లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. టెక్కలితో పాటు చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరంగా, పిల్లల ఆటల కోసం, పట్టణవాసులు వ్యాయామం కోసం, అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారు. అయితే గత నాలుగు ఏళ్లుగా ఆ పార్కు నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. కనీసం సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో పార్కు లోపల పెద్ద పెద్ద ముళ్లపొదలు పెరిగి అడవిని తలపిస్తోంది. ఫుట్‌పాత్‌లు, కుర్చీలు, విగ్రహాలు, పిల్లల ఆట పరికరాలు శిథిలావస్థకు చేరాయి. తిరిగి ఉపయోగించలేని పరిస్థితికి చేరడంతో పార్కులో ఉండే ఇనుప సామగ్రి, కంచె, పిల్లల ఆడుకునే పరికరాలు దొంగల పాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. పగలూ, రాత్రి అనే తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో ఎక్కడా చూసిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ జనాలు, చిన్నారులతో కళకళలాడుతూ ఉండే పార్కు నిరుపయోగకరంగా మారిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.