"ఉద్దానం సమస్యపై ఏం చర్యలు తీసుకున్నారు?" - ఉద్దానంపై హైకోర్టు విచారణ
ఉద్దానం ప్రజల కష్టాలను తీర్చాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టును... పిల్ దాఖలు చేసిన న్యాయవాది కోరారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారానికి, బాధితుల్ని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏపీ హైకోర్టు ఆదేశించింది. దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాతంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొంటూ న్యాయవాది సింహాచలం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో బాధితుల సంక్షేమం దృష్ట్యా చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. ప్రాథమిక విద్య నుంచే కిడ్నీ వ్యాధిపై బోధన అందించాలని... ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం సహా పౌష్టికాహారం అందించాలని అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఆ వివరాల్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి, కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి, విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, శ్రీకాకుళం జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని స్పష్టంచేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయఉమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి. శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.