Please do us justice Srikakulam Electrical Contractors: రోజురోజుకు రాజకీయ నాయకుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని.. ప్రభుత్వం గానీ, ఉన్నతాధికారులు గానీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని.. శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రికల్ లైసెన్సుడ్ కాంట్రాక్టర్లు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఏ తమను పదేపదే వేధింపులకు గురి చేస్తున్నారని.. యూనియన్ అధ్యక్షుడు పాపారావు ఆరోపించారు. ధర్మాన కృష్ణదాస్ పీఏపై వెంటనే చర్యలు తీసుకొని.. తమకు, తమ ఉద్యోగాలకు అండగా నిలవాలని కోరుతూ.. నేడు ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ దైవప్రసాద్‌కి వినతిపత్రాన్ని అందజేశామన్నారు.
ఈ సందర్భంగా నరసన్నపేట సబ్ డివిజన్ కాంట్రాక్టర్ గొద్దు చిరంజీవులు మాట్లాడుతూ.. ''గత 20 సంవత్సరాలుగా నేను ఎలక్ట్రికల్ పని చేస్తున్నాను. నా వద్ద మరో 30మంది పని చేస్తున్నారు. గత ఆరు నెలల నుంచి మాజీమంత్రి కృష్ణదాస్ పీఏ మురళీ మమ్మల్ని రాజకీయంగా పదేపదే వేధిస్తున్నారు. నా వద్ద పనిచేస్తున్న వారిని తొలగించి, అతను చెప్పినవారికి పని కల్పించాలంటూ డీఈకి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కి, ఎస్‌ఈలకి ఫోన్లు చేసి నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని కృష్ణదాస్‌కి తెలియజెప్పడానికి రెండుసార్లు ప్రయత్నించాము. కానీ, ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయాము. ఈరోజు మా సమస్యను వినతిపత్రం రూపంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ దైవప్రసాద్ అందించాము.