శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మున్సిపాలిటీలో.. నేటికీ పూర్తి స్థాయిలో మంచినీటి పథకం అమలు కావడం లేదు. పురుషోత్తపురం, అమీన్ సాహెబ్ పేట, పరిధిలో ఉన్న ప్రజలకు జీవనానికి అవసరమైన నీరు వారికి నిత్యం సమస్యగా మారింది. ప్రజలకు తాగునీటి సదుపాయం లేకపోవడంతో కొన్ని కిలోమీటర్లు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. బిందెడు నీటి కోసం ప్రమాదాన్ని దాటుకుంటూ వెళ్లడం మహిళలకు నిత్యకృత్యంగా మారింది. రైల్వే పట్టాలపై కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది.
బిందెడు నీటి కోసం.. ప్రమాదకర ప్రయాణం
ఎన్ని ప్రభుత్వాలు మారిన వారి సమస్యలు మాత్రం తీరటంలేదు. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా.. అవి పూర్తి స్థాయిలో అమలు కాకాపోవటంతో.. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని.. పురుషోత్తపురం, ఏఎస్ పేట ప్రాంతాల్లో.. మూడు దశాబ్దాలుగా నీటి సమస్య వేధిస్తున్నా.. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవటం లేదు.
1, 2, 3 వార్డులుగా గుర్తింపు పొందిన పురుషోత్తపురం, ఏఎస్ పేట ప్రాంతాలను.. మూడు దశాబ్దాలుగా నీటి సమస్య పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఉన్న బోరు నుంచి నీరు సేకరించి ట్యాంకర్‌తో ఈ మూడు వార్డులోని.. 7 ప్రాంతాలకు అందిస్తున్నారు. ఈ నీరు సరిపోక.. స్థానికులు చీకటి రోడ్డు కూడలిలోని ప్రజా బావి రైల్వే గేటు వద్ద నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు ప్రజాసమస్యలు గాలికి వదిలేశారని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:స్పిల్‌వేలోకి గోదావరిని మళ్లించేందుకు నిపుణుల కార్యచరణ