వినాయకుడు: మూషికా..చవితి ఈ రోజే కదా! ఇదేమిటీ ఎక్కడా ఒక్క మండపమూ కనిపించడం లేదు. హడావుడీ లేదు...ఏర్పాట్లూ లేవు?
మూషిక:ప్రభూ! మీకు చెప్పడం మరిచితిని! భూలోకాన్ని కరోనా అనే మహమ్మారి చుట్టేసింది. అన్ని వర్గాలను కకావికలం చేసింది. అందుకే ఈ ఏడాది మండపాల ఉత్సవాలకు స్వస్తి చెప్పారు. ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఎవరింట్లో వారే పూజలు చేసి మిమ్మల్ని కొలుస్తున్నారు స్వామి!
వినాయకుడు: పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉంటే వేలాదిగా జనాలేంటి?
మూషిక: ఏం చెప్పమంటారు కపిలాయ! ఈ జనంలో ఇసుమంతైనా భయం లేదు. అదిగో అటు చూడండి! శ్రీకాకుళం నగరంతో పాటు పలాస, ఆమదాలవలస, రాజాం, ఇచ్ఛాపురం, పాలకొండ పట్టణాల్లో జనం ఎలా విచ్చలవిడిగా రహదారులపై తిరుగుతున్నారో! వారు కనీసం మాస్కులు సైతం ధరించలేదు చూశారా! భౌతిదూరమైనా పాటించారా? వీరి వల్లే కరోనా వ్యాప్తి చెందుతోంది పార్వతీ తనయ!
వినాయకుడు: అదేంటి..అలా బీళ్లు దేరి భూమండలం కనిపిస్తోంది! అటు నీళ్లు లేవు..ఇటు పచ్చదనం కొరవడింది.. అన్నపూర్ణగా పేరొందిన ఈ సిక్కోలుకు ఏమైంది?
మూషిక: అది వంశధార జలాశయం ప్రభు! పనులు పూర్తికాకపోవటంతో నీళ్లు నింపలేదు. అదిగోండి..ఆ పక్కనున్న 0.66 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండే గొట్టాబ్యారేజీ నుంచి 2.10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే క్రతువు ప్రారంభించారు. ఎడమ కాలువ ద్వారా 1,843 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 487 క్యూసెక్కులు వదులుతున్నట్లు చెబుతున్నా టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో ఆయకట్టుకు నీరందడంలేదు. గార మండలంలోనూ ఇదే పరిస్థితి. అదిగోండి అది మడ్డువలస జలాశయం. ఇది నారాయణపురం ఆనకట్ట. ఈ కాలువల నీళ్లు ఎచ్చెర్ల, జి.సిగడాం, సంతకవిటి, మండలాలకు అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. తోటపల్లి కాలువ నీళ్లు అందక మరిన్ని మండలాల రైతులు బాధపడుతున్నారు వికటాయ!
వినాయకుడు: ఎక్కడికక్కడ జనం ఆ బారులు తీరిన వరుసలేంటి? అంత అవసరం వారికేమొచ్చింది?
మూషిక:ఏం చెప్పమంటారు లంభోదరా! ఒకొక్కరిది ఒక్కో కథ! వీరు ఉడుపులు చేసి వారాలు దాటింది. యూరియా కోసం అదిగో ఇలా రైతు భరోసా కేంద్రాలు, పీఏసీఎస్‌లు, ప్రైవేటు డీలర్ల వద్ద బారులు తీరారు. సరిపడా యూరియా లేక అవస్థలు పడుతున్నారు. వీరేమో బ్యాంకుకు వచ్చిన జనం! బ్యాంకు రుణాలకు వచ్చిన వారు కొందరైతే, ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల కింద జమ చేసిన సొమ్ములు తీసుకోవడానికి వచ్చినవారు మరికొందరు! అది సరే మరి వారో!! ..సరిపోయింది మహాగణపతి! వారేమీ కష్టాలతో బారులు తీరలేదు. మద్యం సీసాల కోసం అదిగో అలా దుకాణాల వద్ద వరుస కట్టారు. నిత్యం మద్యం దుకాణాల వద్ద ఇదే వరుస ప్రభూ! నిబంధనలు పాటించకుండా కరోనా వ్యాప్తికి వీరూ ఒక కారణమవుతున్నారు.