ఆరు సంవత్సరాల్లోనే డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి బాధితులకు కుచ్చుటోపి పెట్టింది ఓ సంస్థ. బాధితులను నమ్మించి వారి నుంచి డిపాజిట్లు సేకరించి.. అనంతరం బోర్డు తిప్పేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా(srikakulam district) పలాసలో జరిగింది. మోసపోయిన బాధితులు పోలీసులను అశ్రయించారు.
దిల్లీ కేంద్రంగా కేఎంజే ల్యాండ్ డెవలపర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ... 2012లో ఏర్పాటైంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో లావాదేవీలు నిర్వహించింది. ప్రజల నుంచి డిపాజిట్లు, ఆర్డీల రూపంలో నగదు సేకరించింది. ఆరేళ్లలో రెట్టింపు చేస్తామని తెలిపింది. నిజమని నమ్మిన బాధితులు రూ.10 కోట్ల మేర డిపాజిట్లు చెల్లించారు. గడుపు ముగియటంతో తమ డబ్బును తిరిగి చెల్లించాలని బాధితులు... సంస్థ అశ్రయించారు. త్వరలోనే చల్లిస్తామని చెప్పి బోర్డు తిప్పేశారని తెలుగు రాష్ట్రాల బాధితులు వాపోయారు. ఉత్తరాంధ్ర పరిధిలోని పలాస, బొబ్బిలి, విజయనగరం పరిధిలోనే రూ.5 కోట్ల మేర డిపాజిట్లు తిరిగి చెల్లించలేదు.