ఉత్తరాంధ్ర పరిధిలోనే అతి పెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఒకే ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలాల కోసం అన్వేషణ చేసింది అధికార యంత్రాంగం. పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో భూములున్నట్లు గుర్తించి అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ 426 ఎకరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గత రెండు నెలల్లో రెండుసార్లు సర్వే చేశారు. తాజాగా ఈనెల ఒకటో తేదీ నుంచి మరోమారు సమగ్ర సర్వే చేపడుతున్నారు. మందస, పలాస మండలాల పరిధిలోని గోపిటూరు, రామరాయి, గెడ్డూరు, చాపరాయివీధి, జన్నివీధి, పట్టులోగాం గ్రామాలతో పాటు ఉద్దానం ప్రాంతంలోని చిన్ననీలావతి, మాకన్నపల్లి, రామకృష్ణాపురం, జినగూరు, చిన్నగురుదాసుపురానికి చెందిన రైతులు భూములను సాగు చేస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు గిరిజనులే ఉన్నారు. మొత్తంగా జీడి చెట్లనే నమ్ముకుని సాగు చేస్తున్నారు.
ఎలాంటి ప్రకటన లేకుండా..
ఎలాంటి ప్రకటన లేకుండా డీ పట్టా భూముల సర్వే జరుగుతోంది. దీంతో ప్రధానంగా గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తరాల నుంచి ఇవే భూములపై జీవనం సాగిస్తున్న తమకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎకరాకు పరిహారం ఎంత చెల్లిస్తారు?, ఇతర అంశాలపై ప్రకటన చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఈ మేరకు సర్వేకు వెళ్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. గిరిజన, ఉద్దానం గ్రామాలకు చెందిన 220 మంది రైతులు భూములు సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దస్త్రాల్లో పేర్లు లేనివారూ ఎక్కువే..
రామకృష్ణాపురం డీపట్టా భూములు సాగు చేస్తున్న రైతుల్లో 30 శాతం వరకు రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు కాలేదు. సాగు చేసుకోవడం తప్ప దస్త్రాల్లో వివరాలు లేవు. దీంతో ఇలాంటి వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారుతోంది. మరో వైపు పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు చెందిన పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించుకొని రెవెన్యూ దస్త్రాల్లో పేర్లు నమోదు చేసుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని లబ్ధి పొందుతున్న సందర్భాలున్నాయి.
40 ఏళ్లుగా సాగు చేస్తున్నాం