శ్రీకాకుళం జిల్లాలో 1,48,242 ఎకరాలకు ఆయకట్టు నిచ్చే వంశధార ప్రాజెక్ట్ ఆవిర్భవించి 50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చివరి భూములకు సాగునీరు అందడం లేదు. పలు మండలాల్లో రైతులు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి... కానీ కాలువ చివరి భూములకు మాత్రం నీరు లభించడం లేదు.
వంశధార ఎడమ కాలువ పరిధిలోని ఎన్బీసీ కాలువకు అనుసంధానంగా ఉన్న 11 ఆర్ కిళ్లాం మేజర్ కాలువ దిగువన 4400 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు చివరి భూముల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం మబగాం గ్రామానికి కూడా వంశధార కాలువ నుంచే నీరు వెళుతుంది. అక్కడ కూడా ఇదే సమస్య ఉంది. నరసన్నపేట మండలం మాకివలస, కిళ్లాం, గోపాలపెంట, దేవాది తదితర గ్రామాలకు ఈ మేజర్ కాలువ నుంచే నీరు సరఫరా కావాలి. ఒకప్పుడు ఈ గ్రామాలతోపాటు మరి కొన్ని గ్రామాలు కూడా ఓపెన్ హెడ్ కాలువ ద్వారా సాగునీరు పొంది సస్యశ్యామలంగా ఉండేవి.