శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం... ఐదారు నెలల్లో సాకారం కాబోతోంది. ఈ జిల్లా వాసుల జీవనాడీ... వంశధార ప్రాజెక్టు పనులు ముగింపు దశకొచ్చాయి. ఇంకా 10 శాతమే మిగిలి ఉన్నాయి. వీలైనంత తొందరగా పెండింగ్ పనులు పూర్తి చేసి... ప్రజల కల సాకారం చేస్తామని నేతలు, అధికారులు చెబుతున్నారు.
14 ఏళ్లుగా సా...గుతున్న పనులు...
వంశధార ప్రాజెక్టు పనులు 2005లో మొదలై... 14 ఏళ్లుగా... సాగుతున్నాయి. కాని నవ్యాంధ్రలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక... పనులు పరుగులు పెట్టాయి. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తూనే... పనుల్లో జోరు పెంచేలా చేశారు సీఎం. ఇప్పటికే హిరమండలం వద్ద నిర్మాణంలో ఉన్న వంశధార జలాశయంలోకి 2018 స్వాతంత్ర వేడుకల సందర్భంగా... నీటిని వదిలారు. వంశధార నదిలోకి నీటి ప్రవాహం రావడంతో... వరదకాలువ ద్వారా ప్రాజెక్టులోకి వదిలారు.
వంశధార జలాశయానికి ఎగువ భాగంలో శాడిల్ డ్యామ్ నిర్మిస్తున్నారు. ఇది ప్రాజెక్టుకు అనుబంధ డ్యామ్. దీని పనులు కూడా వంశధార జలాశయం ప్యాకేజీలో అంతర్భాగం చేశారు. అనుబంధ డ్యామ్ పనులు కూడా దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. కొత్తూరు మండలం ఎన్నిరామన్నపేట వద్ద సబ్సిడరీ గట్టు నిర్మించాలన్నది కూడా ప్యాకేజీలో ఒప్పందమే. కానీ ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇచ్ఛాపురంలో ఉన్న బహుదానదికి అనుసంధానం ఇక్కడి నుంచే చేయనున్నారు. కాలువ ద్వారా ఇక్కడి నుంచి నీరు తరలించే ప్లాన్ ఉండడం వల్ల సబ్సిడరీ బండ్ నిర్మాణం డిజైన్‌లో... ఏమైనా మార్పులు జరుగుతాయనే అనుమానంతో... పనులు ఇంకా ప్రారంభించలేదు.
ఒడిశాలో గతేడాది భారీ వర్షాలు కురవడంతో... వంశధార నదికి వరద పోటెత్తింది. ఆ సమయంలో కాట్రగడ వద్ద ఉన్న సైడ్‌వీయర్ ద్వారా నీటిని వరద కాలువ నుంచి సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్... పారాపురం జలాశయానికీ తరలించారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు కూడా 60 శాతం పూర్తియ్యాయని అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసుకొని జిల్లా రైతులకు వంశధార దన్నుగా నిలవనుంది.