శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీటి సమస్యలు తప్పడం లేదు. ఎడమ కాలువతో పాటు కుడి కాలువ ఆయకట్టు నిర్ధారణ లేక వాటి అభివృద్ధి ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఎడమ కాలువలో విడుదల చేయాల్సిన నీటి కంటే తక్కువ చేయడంతో కాలువ శివారు భూములకు నీరు అందడం లేదు. కారణం కాలువ గట్లు దయనీయంగా ఉన్నాయి. గొట్టాబ్యారేజీ నుంచి 104.82 కి.మీ. మేరకు ప్రయాణించే ఎడమ కాలువల వ్యవస్థ ద్వారా పలాస మండలం ఈదురాపల్లి వరకు కాలువ చివరి భూములకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నేటికీ నెరవేరలేదు.
* ప్రతిపాదనలతోనే కాలక్షేపం చేస్తుండటంతో వంశధార ఎడమ కాలువ ఆధునికీకరణ గాలిలో దీపంలా మారింది. మరోవైపు కాలువ చివరి భూములకు సాగునీరు అందించాలంటే టెక్కలి డివిజన్ పరిధిలో ప్రధాన కాలువ ద్వారా 650 క్యూసెక్కుల నీరు పంపించాలి. కాలువల గట్లు ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరడంతో ఆ స్థాయిలో నీరు పంపలేని పరిస్థితి. ఇక నరసన్నపేట డివిజన్ పరిధిలో ఓపెన్‌హెడ్ కాలువలతో పాటు వంశధార కాలువల ఆధునికీకరణ కూడా స్తంభించిపోయింది.
* రూ.74 కోట్లతో నరసన్నపేట డివిజన్‌లో తలపెట్టిన కాలువల ఆధునికీకరణ నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. నిధులు లేక ప్రధాన కాలువ అధ్వానంగా మారుతుంటే, నిధులు మంజూరైనా పనులు పూర్తి కాక మేజర్ కాలువల పరిస్థితి దయనీయంగా ఉంది.
* టెక్కలి డివిజన్ పరిధిలో వంశధార ఎడమ ప్రధానకాలువ కింద 57,690 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలి. 41ఆర్ కాలువ నుంచి 68ఇ వరకు 28 పిల్ల కాలువలతో పాటు దేశబట్టి ద్వారా సాగునీరు సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి డివిజన్‌కు 850 క్యూసెక్కుల నీరు వాటాగా అందించాలి. అయితే డివిజన్‌లో సాగునీటి వ్యవస్థపై పూర్తిగా నిర్లక్ష్యం ఏర్పడింది. ఈ ఏడాది టెక్కలి డివిజన్ ప్రారంభసూచీ వద్ద సగటున 450 క్యూసెక్కుల నీరు సరఫరా జరిగింది. ఎక్కడికక్కడ పిల్ల కాలువలు మరమ్మతులకు గురవడం, శిథిలస్థితికి చేరుకోవడం, ఆక్రమణలతో బక్కచిక్కడంతో సాగునీటి వ్యవస్థ పూర్తిగా మృగ్యమవుతోంది. కాలువలకు గండ్లు పడుతున్నా వాటిని పరిశీలించేవారే లేరు.
* వంశధార నది పొడవు : 265కి.మీ
* ప్రాజెక్టు ఆయకట్టు : 2,09,047 ఎకరాలు
* నీటి సంఘాలు.. 54
* డీసీలు : 8
* ప్రాజెక్టు కమిటీ : 1
ఆధునికీకరణ అవసరం
ఎడమ ప్రధాన కాలువ ఆవిర్భావం నుంచి ఆధునికీకరణ లేకపోవడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవం. దీనిపై రూ.725 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణ అవసరం.
- డోల తిరుమలరావు, పర్యవేక్షక ఇంజినీరు, వంశధార ప్రాజెక్టు
ప్రభుత్వానికి నివేదిస్తాం
లష్కర్ల వ్యవస్థ లేకపోవడంతో కాలువలు పూర్తిగా రూపుమారిపోతున్నాయి. ఎక్కడికక్కడ పనులు జరుపుతున్నా షట్టర్లు లేక పంపిణీ నీరసిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తాం. అత్యవసరంగా చేయాల్సిన పనులను ప్రాధాన్యతాక్రమంలో ప్రారంభిస్తే సాగునీటి వ్యవస్థ నిలదొక్కుకుంటుంది.
- శేఖరరావు, ఈఈ, వంశధార ప్రాజెక్టు, టెక్కలి.
కుడి...కాలువ