శ్రీకాకుళం జిల్లా పొందూరు ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో...వస్త్ర ప్రదర్శనను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించారు. జాతీయ చేనేతకారుల దినోత్సవం కార్యక్రమంలో..సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైకాపా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, భాజపా ఎమ్మెల్సీ మాధవ్ తో కలిసి పాల్గొన్నారు. నూలు వడుకు యంత్రాలను పరిశీలించిన కేంద్రమంత్రి...,నేత కార్మికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కార్మిక సంఘ భవనం ఆవరణలో కొత్తగా నిర్మించనున్న ఖాదీ కార్మికుల సామూహిక షెడ్‌కు..కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నేత కార్మికులు మర యంత్రాల ద్వారా వస్త్రాలను రూపొందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. వస్త్రాల తయారీకి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను తిలకించిన కేంద్రమంత్రి...ప్రాంగణంలో మొక్క నాటారు. పొందూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో...కేంద్రమంత్రి పాల్గొన్నారు. పొందూరు ఖాదీ విశిష్టతను..సభాపతి తమ్మినేని సీతారాం నిర్మలా సీతారామన్‌కు వివరించారు. పొందూరు ఖాదీ అభివృద్ధికి...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు కోరారు.
ఖాదీ కోసం కేంద్ర పథకాలు
మహాత్మగాంధీ పొందూరు ఖాదీ నాణ్యత పట్ల ఎంతో ఆసక్తి చూపారని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ఆ తరహాలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖాదీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఖాదీ బాగుపడాలనీ మోదీ చాలా పథకాలు ప్రకటించారని ఆమె అన్నారు. 2015వ సంవత్సరంలో ప్రధాన మంత్రి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించినట్లు వివరించారు. ఖాదీ కార్మికులు అభివృద్థి చెందాలని, ప్రత్యేకంగా బాగుపడాలనే ఆయన తపన అన్నారు. ఖాదీ పట్ల ప్రజల ఆదరణ పెరిగిందన్నారు. 2014 సంవత్సరంలో 9 వేల కోట్లుగా ఉన్న ఖాదీ ఉత్పాదకత..2021 నాటికి 18 వేల కోట్లకు పెరిగిందని ఆమె వివారించారు. ఖాదీకి చాలా ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అయితే కార్మికులకు గిట్టుబాటు ధరలు లేదని ఆమె పేర్కొంటూ.. మెగా హండ్లుమ్ క్లస్టర్ లు ఏర్పాటు చేశామని చెప్పారు.
మహాత్మాగాంధీ నుంచి ఇప్పటివరకు ఖాదీకి ప్రత్యేకత ఉంది. పొందూరు ఖాదీ పరిశ్రమను అన్నివిధాలుగా ఆదుకుంటాం. పొందురూ ఖాదీ అభివృద్ధికి సంబంధించి అధ్యయనం చేస్తాం. పార్టీలకు అతీతంగా పొందూరు ఖాదీ పరిశ్రమను అందుకుంటాం. పొందూరు ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుంది. మంగళగిరి తరహాలో చేనేత మోగా క్లస్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి