రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నరసన్నపేటలో భూగర్భ డ్రైనేజీ నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యం. వివిధ కారణాలతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. నరసన్నపేటలో డ్రైనేజీ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే బగ్గు రమణామూర్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 22 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అక్కడ భూగర్భ డ్రైనేజీ అనివార్యం రోజూ వేల మంది.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీలో 26 వేల జనాభా. ఇక్కడికి దాదాపు 8 మండలాల నుంచి పదివేల మంది రోజు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. గతేడాది అంటురోగాలతో నలుగురు మృతి చెందారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకు భూగర్భ డ్రైనేజీ ఒకటే మార్గమని ప్రభుత్వం భావించింది. తెదేపా అధికారం చేపట్టిన వెంటనే...భూగర్భ డ్రైనేజీ కోసం 2015 జూన్ నెలలో 9 కోట్లు మంజూరు చేసింది. తర్వాత ఆ మెుత్తాన్ని 22 కోట్లకు పెంచింది. ఇదే నియోజకవర్గంలోని సైరిగాం గ్రామానికి 2 కోట్లు కేటాయించింది.
72 కిలోమిటర్ల నిర్మాణం! ఈ పంచాయతీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ 72 కిలోమీటర్లు నిర్మించాలి. మురికి నీటిని వ్యర్థాలు తొలగించేందుకు 25 చోట్ల అవుట్‌లేట్లు నిర్మిస్తున్నారు. 3ప్రాంతాల్లో మురికి నీటి శుద్ధీకరణ నిర్మాణాలు చేస్తున్నారు. 35 కిలోమీటర్ల మేరకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు పూర్తయ్యాయి. హడ్కోకాలనీ, పురుషోత్తంనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరిగాయి. మరో నెల రోజుల్లో నరసన్నపేటలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. భూగర్భ డ్రైనేజీపై స్థానికులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దోమల తాకిడి తగ్గి జబ్బులకు ఖర్చు చేసే సొమ్ము ఆదా అవుతుందన్న భావన వ్యక్తం పరుస్తున్నారు.