శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 21 శాతం మంది దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు జార్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ వెల్లడించింది. 2018 ఆగస్టు నుంచి ఉద్దానంలోని వజ్రపుకొత్తూరు , పలాస, మందస, సోంపేట, కవిటి , కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జార్జ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనం సాగిస్తోంది. బాధితుల నుంచి సేకరించిన రక్త , మూత్ర నమూనాలు పరీక్షించి వ్యాధి తీవ్రత గుర్తించింది. ఈ అధ్యయన నివేదిక అంతర్జాతీయ కిడ్నీ రిపోర్టు జర్నల్‌లో డిసెంబరులో ప్రచురితమైంది. మరోవైపు పర్యావరణ పరిస్థితులపైనా చేసిన అధ్యయన వివరాలు 'గ్రౌండ్ వాటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ జర్నల్‌లో అక్టోబరులో ప్రచురితమయ్యాయి.
ఉద్దానంలోని 67 గ్రామాలకు చెందిన 2 వేల 419 మంది నుంచి 3 నెలల వ్యవధిలో 3సార్లు రక్త , మూత్ర నమూనాలు సేకరించి పరీక్షించారు. నమూనాలిచ్చిన వారు అప్పటివరకు ఏయే సందర్భాల్లో ఏ మందులు వాడారు ? మద్యం అలవాటు , ఇతర అంశాలతోపాటు రక్త పరీక్షల నివేదికలు విశ్లేషించారు. 2వేల 410 మందిలో 506 మంది కొన్నేళ్ల నుంచి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. వయసును బట్టి మూత్రపిండాల్లో రక్తశుద్ధి నిమిషానికి 90 నుంచి 120ఎంఎల్ జరగాలి. 246 మందికి ఇంతకంటే తక్కువగా జరుగుతోందని తేలింది. ఇది ప్రమాదకర సంకేతమని జార్జి ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ వెల్లడించింది. మూత్రం ద్వారా బయటకు వెళ్లే యూరిన్ ప్రొటీన్ శాతం 150 ఎంజీ వరకు ఉంటుంది. 16 శాతం మందికి 150 ఎంజీ కంటే ఎక్కువగా వెళ్తున్నట్లు గుర్తించారు.