శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలోని పెద్దదిమిలి గ్రామానికి చెందిన సల్ల భుజంగరావు(22) అనే యువకుడు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు గట్టెక్కించేందుకు నరసన్నపేటలోని ఒక సంస్థలో గుమస్తాగా చేరాడు. ఎప్పటిలాగే సాయంత్రం స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యాడు. తన ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భుజంగరావుకు తల్లిదండ్రులు, ముగ్గురు అక్కలు ఉన్నారు.
మరో ప్రమాదం..
జలుమూరు మండలం అంధవరం పంచాయతీ ఉప్పరపేట వద్ద గురువారం జరిగిన రహదారి ప్రమాదంలో రామకృష్ణాపురానికి చెందిన రేగాన సింహాచలం(58) అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం ఇంటికి అవసరమైన సామగ్రి కొనేందుకు నరసన్నపేట మండలం ఉర్లాం వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటాడన్న సమయంలో వెనుక నుంచి వస్తున్న కారు అతని ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సింహాచలానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని, ఇంటి పెద్దదిక్కు కోల్పోయామని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నకుమారుడు నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. వై.కృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి:
అవయవదానంతో నలుగురికి ఆయువు పోశాడు