శ్రీకాకుళం జిల్లా విద్యాధికారిణి కుసుమ చంద్రకళ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త కమల్‌కుమార్, తల్లి రోజావిజయలక్ష్మి ఒక రోజు వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. విశాఖలో ఉంటున్న తల్లికి పాజిటివ్ రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడే చికిత్స పొందుతూ ఆమె శనివారం కన్నుమూశారు. పది రోజులుగా విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త జి.కమల్‌కుమార్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 26న డీఈవో చంద్రకళకు కూడా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.
ప్రకాశం జిల్లాలో ఒకేరోజు దంపతుల మృతి
గంటల వ్యవధిలో దంపతులు కన్నుమూసిన ఉదంతం ప్రకాశం జిల్లాలో విషాదాన్ని నింపింది. రాచర్ల మండలం గౌతవరానికి చెందిన సూరినేని కోటయ్య (50) నెల్లూరులో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అక్కడే భార్య శ్రీదేవి(45), కుమార్తె, అత్తామామలు ఎస్.పుల్లయ్య, రాములమ్మతో కలిసి నివసిస్తున్నారు. అత్తామామలకు ఇటీవల వైరస్ సోకింది. భార్య శ్రీదేవికి, కోటయ్యకు కూడా పాజిటివ్ రావడంతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. శనివారం ఉదయం కోటయ్య కన్నుమూయడంతో మృతదేహాన్ని రాత్రి స్వగ్రామం గౌతవరం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శ్రీదేవి మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. ఈ దంపతుల చిన్న కుమార్తెకు ఈనెల 21న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఏర్పాట్లలో ఉండగా ఇంతలో విషాదం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి:
కరోనా కట్టడికి.. 'సుప్రీం' చొరవే చుక్కాని!