శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం, తెప్పలవలస గ్రామానికి చెందిన మేడూరి శశిధర్ (22), మేడూరి శ్రీనివాసరావు (42).. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఉదయం ఇంటి నుంచి చెరువుకెళ్లిన వీరిద్దరూ ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహలను వెలికితీశారు.
శశిధర్ ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మరో రెండు రోజుల్లో స్థానిక పరిశ్రమలో ఉద్యోగంలో చేరేందుకు ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్న తరుణంలో.. అతన్ని చెరువు రూపంలో మృత్యువు కబళించింది. దీంతో అందివచ్చిన కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే శ్రీనివాసరావు మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అతని భార్య, ఇద్దరు పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.