పాలకొండ మండలం అంపిలి గ్రామంలో ఓటర్లు
మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిరాశ పరిచిన ఓటర్లు మూడోదశలో ఓటెత్తారు.. ఉత్సాహంగా ఓట్ల పండగలో పాల్గొన్నారు. తమ పల్లెను పాలించే నాయకుడిని ఎన్నుకున్నారు. ఆమదాలవలస, పాలకొండ, రాజాం నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మండలాల్లో మూడో దశ ఎన్నికలు బుధవారం ముగిశాయి. రేగిడి మండలం కొండవలస గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, దహనం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మిగిలిన చోట్ల ఓటర్లంతా తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులుదీరారు. 248 పంచాయతీ స్థానాలకు 588 మంది పోటీపడ్డారు. 80.13 శాతం పోలింగ్ నమోదైంది.
వలసలు తక్కువగా ఉండటమే..
తొలి రెండు దశల్లో ఓటింగ్ శాతం 75.77, 72.87గా నమోదైంది. రాష్ట్రంలోనే జిల్లాలో అతి తక్కువ మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈనేపథ్యంలో మూడోదశలో ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జె.నివాస్ సహా అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. ఓటింగ్ శాతం పెరగడానికి ఇదీ ఓ కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మూడోదశలో ఎన్నికలు జరిగిన మండలాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే వారు చాలాతక్కువ. ప్రజలంతా స్థానికంగా అందుబాటులోనే ఉండడంతో ఎక్కువ మంది ఓటేయడానికి అవకాశం ఏర్పడింది. ఫలితంగా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అయితే ప్రధాన గిరిజన మండలమైన సీతంపేటలోని గ్రామాల్లో తక్కువ నమోదైంది. పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు దూరాభారం, ప్రచారం లేకపోవడం, కొందరికి విషయం తెలియకపోవడం వంటివి కారణాలుగా తెలుస్తున్నాయి. సీతంపేటలో 67.76 శాతం మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు.
భద్రత కట్టుదిట్టం..
ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ అన్ని చోట్లా పోలింగ్ సజావుగా సాగింది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు ముందుగానే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. గతంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ పోలీసులు, భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటలకే చిన్న పంచాయతీల్లోని వార్డులు, సర్పంచుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎక్కువ ఓటర్లున్న చోట్ల మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఫలితాలు వేగంగానే వచ్చాయి.
ఇదీ చూడండి.పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పోలింగ్