ఉద్యోగుల మూడో దశ ఉద్యమం ప్రారంభం.. AP JAC Amaravati third phase of movement started: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్దమయ్యారు. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఇటీవలే రెండో దశ ఉద్యమ కార్యాచరణను పూర్తి చేసుకున్న ఉద్యోగ సంఘాలు.. నేటి నుంచి మూడవ దశ ఉద్యమానికి నాంది పలికారు. ఉద్యోగులు గత రెండు నెలలుగా ఉద్యమం చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటంతోనే ఈ మూడో దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.
మూడో దశ ఉద్యమం ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు గత 2 నెలలుగా ఉద్యమం చేస్తున్నా.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవటంతో.. మూడో దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నేడు ఉద్యోగుల మొదటి ప్రాంతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సుకు ముందు రెవెన్యూ గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ కళా వేదిక వరకు ఉద్యోగులతో ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల ప్రాంతీయ సదస్సులు ప్రారంభమైయ్యాయని బొప్పరాజు తెలిపారు.
చిన్న ఉద్యమాలకు స్వస్తి-పెద్ద ఉద్యమాలకు నాంది.. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..''ఉద్యోగులు గత 60 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. అయినా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ స్పందించటంలేదు. ఇప్పటివరకూ మేము చిన్న చిన్న ఉద్యమాలే చేపట్టాం. అందుకే మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. ఇకపై చిన్న ఉద్యమాలకు స్వస్తి పలికి..పెద్ద ఉద్యమాలకు సిద్దమయ్యాం. నేటి నుంచి మూడవ దశ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. శ్రీకాకుళంలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యోగుల మొదటి ప్రాంతీయ సదస్సును ప్రారంభించాం. అంతకు ముందు రెవెన్యూ గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ కళా వేదిక వరకు ర్యాలీగా వచ్చాం. 96 సంఘాల్లో ఉన్న ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ప్రాంతీయ సదస్సుకు పూర్తి మద్దతు ప్రకటించారు. మూడవ దశ ఉద్యమ కార్యాచరణతో ఉద్యోగులు ముందుకు వెళ్లనున్నారు. ఈరోజు శ్రీకాకుళంలో జరుగుతున్న ప్రాంతీయ సదస్సుతోపాటు.. అనంతపురం, ఏలూరు, గుంటూరుల్లో కూడా ఈ సదస్సులు జరుగుతున్నాయి. ఈ మూడో దశ ఉద్యమం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తారా..? లేదా?. అలాగే, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తారా..? లేదా..?. లేనిపక్షంలో ఈ ప్రభుత్వం భవిష్యత్తులో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది అని హెచ్చరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఉద్యోగులు ఆషామాషిగా తీసుకోవద్దని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.'' అని ఆయన అన్నారు.
రాష్ట్ర సీఎస్‌కు నోటీసు అందజేత.. ఒప్పంద ఉద్యోగుల గురించి, కొత్త డీఏల గురించి తాజాగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏపీ జేఏసీ అమరావతి నేతలు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి మూడో దశ ఉద్యమ కార్యాచరణ నోటీసును అందించారు. ఆ నోటీసులో.. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణను మళ్లీ ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతేకాదు, మూడో దశ కార్యాచరణలో ఆయా జిల్లాల్లో ప్రాంతీయ సదస్సులను కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన ఉద్యోగుల సమస్యలపై నిరాహార దీక్షలు కూడా చేపడతామని తెలియజేశారు.
ఇవీ చదవండి