Vedic University: ఏళ్లు గడుస్తున్నా.. పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు Vedic University in Srikakulam district: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తర్లిపేట గ్రాములో అంతర్జాతీయ వేద విశ్వవిద్యాలయం నిర్మించేందుకు టీడీపీ ప్రభుత్వం 2016లో శ్రీమత్ ఉభయ వేదాంత ఆచార్య పీఠం ట్రస్ట్ వారికి 209 ఎకరాలు భూమిని అప్పగించింది.
నవంబర్ 13.. 2016న అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన 1.53 కోట్ల రూపాయలు చెల్లించిన సంస్థకు తర్లికొండపై స్థలాన్ని రెవెన్యూ శాఖ అప్పగించింది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం పునాదులు కూడా మొదలుపెట్టలేదు ఆ సంస్థ. వేద విశ్వవిద్యాలయం కోసం ప్రభుత్వం దగ్గర నుంచి వందల ఎకరాలు తీసుకున్న సంస్థ.. అక్కడ దీర్ఘాయువు పేరుతో ఆయుర్వేద చికిత్సలు అందించేందుకు పలు నిర్మాణాలు చేపట్టింది.
ప్రభుత్వం మారడంతో పనులు.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వేద విశ్వాదిద్యాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి పొందితే తమ బతుకులు బాగుపడతాయని తర్లిపేట గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ పునాదులు కూడా వేయకపోవడంపై సంస్థపై స్థానికులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం ఈ సంస్థకు కొండపై స్థలాలను ఇవ్వకముందు ఈ కొండ సమీప ప్రాంతాలు నివాసముంటున్న వేలాది మందికి అనేక రకాలుగా ఉపయోగపడేది. గతంలో ఇదే కొండపై ఉపాధి హామీ పనులు జరిగేవని.. ఇప్పుడు కనీసం పశువులకు మేత కూడా దొరకటం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఉపాధి లేక యువత వలసలు పోతున్నారని వేద విశ్వవిద్యాలయం పనులు ప్రారంభమైతే ఉపాధి దొరుకుతుందని.. ఆశగా ఎదురుచూస్తున్నారు. వేద విశ్వవిద్యాలయం అభివృద్ధి పనులు చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ..రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో స్థలాన్ని అప్పగించడంలేదని.. సంస్థ ప్రతినిధులు అంటున్నారు.
"209 ఎకరాల 84 సెంట్ల భూమి ఇస్తే.. మా గ్రామ పరిధిలో నిరుపేదలు ఇళ్లు కట్టుకోవడానికి సెంటు స్థలం ఇవ్వలేక పోయాం. మీరు మిగతా స్థలం అభివృద్ధి చేయండి.. 50 కుటుంబాలకు స్థలం ఇవ్వండి అంటే ఇవ్వలేదు. ఇలాంటి స్వామిలు మాకు అవసరం లేదు. ఇక్కడ మరి అభివృద్ధి కూడా జరగదని అనుకుంటున్నాం. అచ్చెన్నాయుడు ఆ రోజు అభివృద్ధి చేస్తానని, ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తానని చెప్పారు.. కానీ నేడు అవన్నీ జరగలేదు". - శ్రీనివాసరావు, తర్లిపేట సర్పంచ్
"ప్రభుత్వం వారి దగ్గర 209 ఎకరాల 84 సెంట్లను తీసుకొని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో.. రెవెన్యూ వాళ్లు పూర్తి స్థాయిలో ఈ కొండను సర్వే చేసి మాకు ఇవ్వలేదు. ఇది పూర్తి స్థాయిలో ఇస్తే.. అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించి చేస్తున్నప్పుడు.. స్థానికంగా ఉన్న కొంతమంది అడ్డుకోవడం వలన మేము ఈ కార్యక్రమం ఆపడం జరిగింది. ఇప్పటికే సుమారుగా కోటి రూపాయలు ఖర్చు చేసి.. దీర్ఘాయువు హాస్పిటల్‌ను ప్రారంభించి.. దానిని నడుపుతున్నాం". - వేమన రావు, వికాస తరంగిని కోఆర్డినేటర్
ఇవీ చదవండి: