TENSION AT PALASA పలాసలో రాజకీయ వేడి రాజుకుంది. 27వ వార్డు కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించనున్నారు. మంత్రి అప్పలరాజుపై సూర్యనారాయణ విమర్శలు చేసిన అనంతరం అతనికి చెందిన ఇళ్లను అధికారులు కూల్చివేత చేపట్టారని, తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో విశాఖకు చేరుకున్న లోకేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనుమతులు లేవు: ఎస్పీ
పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ఆదివారం ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు పోలీస్ పరంగా అనుమతులు మంజూరు చేయలేదని ఎస్పీ జి.ఆర్.రాధిక ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతుల్లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జంట పట్టణాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ వివరించారు.
తెదేపా నేతల అడ్డగింత: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద తెదేపా నేతలను పోలీసులు అడ్డగించారు. అచ్చెన్న, రామ్మోహన్, చౌదరి బాబ్జీని అడ్డుకున్నారు. పలాసలో శుభకార్యానికి వెళ్తున్నామని పోలీసులకు తెలపగా.. అచ్చెన్నాయుడితో పాటు కారులో పోలీసులు బయలుదేరారు.
ఇదీ జరిగింది: శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీనివాసనగర్‌లోని 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకున్నారు. చెరువు గర్భంలో ఆక్రమంగా నిర్మాణాలు జరిపారని వాటిని తొలగించేందుకు వచ్చామని పేర్కొనటంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని.. విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కూలగొడతామంటే తామంతా ఎక్కడికి వెళ్లాలంటూ అడ్డు తగిలారు.