Tirumala Model Temple in palasa: చిన్నపిల్లలు అన్నం తినడానికి మారం చేస్తుంటే "చందమామ రావే.." అంటూ ఆ జాబిలిని పిలుస్తూ అమ్మ అన్నం తినిపిస్తుంది.. చందమామని రప్పించడం జరగని పని అని తెలిసినా.. పిల్లల కోసం తల్లి అబద్ధాలు చెప్తుంది. కానీ అలాంటి అసాధ్యాన్ని ఓ తల్లి సాధ్యం చేసి చూపిస్తోంది. పలాసకు చెందిన 95 ఏళ్ల హరి ముకుందపండా పదేళ్ల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లాడు. స్వామివారి దర్శనం సంతృప్తికరంగా జరగలేదని తిరిగి వచ్చి తన తల్లికి చెప్పగా దైవం ఎక్కడైనా ఒక్కటే అంటూ తిరుమల లాంటి గుడి మన ఊర్లోనే కట్టుకోమని చెప్పింది, ప్రస్తుతం పలాస పట్టణం నడిబొడ్డున 12 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల దేవస్థానం లాంటి ఆలయ నిర్మాణం జరుగుతోంది ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఆలయ నిర్మాణం పనులు ఐదారు నెలల్లో పూర్తవుతున్న నేపథ్యంలో ఆ క్షేత్రం విశేషాలివీ..
రాజ కుటుంబీకుల ఆధ్వర్యంలో... ఒడిశా రాజ కుటుంబానికి చెందిన హరి విష్ణు ప్రియ పండాని అమ్మ వయస్సు దాదాపు 110 ఏళ్లకు పైనే ఉంటుంది నిత్యం అమ్మవారి ఉపాసన చేస్తూ తమ ఇంటికి వచ్చిన ఎంతోమందికి గుప్తంగా దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరితో కూడా మాట్లాడారు. నిత్యం దైవ ధ్యాన నిమగ్నులై ఉంటారు. ఆమెకు ఒక్కగాన ఒక కుమారుడైన హరి ముకుందా పండా పదేళ్ల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లాడు.చాలా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు దర్శనంచేసుకునేటప్పుడు ఆయనని అధికారులు పక్కకు తోసేయడంతో చాలా బాధపడ్డారు. ఆయనతోపాటు సాధారణ భక్తుల పరిస్థితి అలానే ఉందని గ్రహించిన ఆయన.. తిరిగి వచ్చి తన తల్లికి ఈ విషయాన్ని తెలిపారు. తన కుమారుడితో పాటు ఎంతోమంది పరిస్థితిని గమనించిన ఆ తల్లి.. తనకున్న కొబ్బరి తోటలోనే 12 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టమని చెప్పింది. దాంతో హరి ముకుంద ఐదేళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. 95 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా పగలనక, రాత్రనకా ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా.. కొన్ని కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఏ ఇంజినీర్ సహాయం కూడా తీసుకోలేదు. తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి, ఏ విగ్రహం పెట్టాలి, శిల్పాలు ఏ విధంగా ఉండాలి..? అనేవి తల్లి ఆదేశం ప్రకారం ముకుంద కార్యనిర్వాహణ చేస్తున్నారు.