Cyclone Jawad Effect: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుపానుగా మారి దూసుకొస్తోంది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్ష నిర్వహించారు.
తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. తాగునీటి కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం..
వాయుగుండం.. తుపాను(Cyclone Jawad)గా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో ఉన్న 'జవాద్' తుపాను.. రేపు(శనివారం) ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలి తీవ్రత పెరగనుందని వెల్లడించారు. రానున్న 12 గంటల్లో తుపాను మరింతగా బలపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఈరోజు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
జవాద్ తుపాను ప్రత్యేకాధికారిగా అరుణ్‌కుమార్
rains in srikakulam: జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ శ్రీకేష్.. జవాద్ తుపాను ప్రత్యేకాధికారిగా అరుణ్‌కుమార్‌ను నియమించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కునేందుకు జిల్లాలో 3 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అవసరమైతే హెలికాప్టర్లు తీసుకొస్తామని ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్ తెలిపారు.