రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 155 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరల పెంపుదలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మార్కెట్ వద్ద ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పెట్రోలు, డీజీలు , గ్యాస్, నిత్యవసర ధరలు బెంబేలెత్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్రోల్, డీజిల్పై దేశంలోనే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న ప్రభుత్వం వైకాపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మందును సీఎం జగన్ గోదాముల్లో తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఆది తాగితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రెండున్నరేళ్లుగా అవినీతే పనిగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మద్యం తయారీ, ఇసుక, మైనింగ్.. ఇలా ప్రతిదానిపై'జె' ట్యాక్స్ వేసుకుని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.