శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ నిరసన వ్యక్తం చేశారు. తెదేపా మద్దతుదారులైన లబ్ధిదారులకు కావాలనే పింఛన్లు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. వీటిని పునరుద్ధరించేవరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.
పింఛన్ల తొలగింపు విషయంపై కొన్ని నెలలుగా ఎమ్మెల్యే, అధికారుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు ఎమ్మెల్యే వినతి పత్రాలు సమర్పించారు. అయినా లబ్ధిదారులకు న్యాయం జరగకపోవటంతో ఈరోజు ఆయన స్పందన కార్యక్రమానికి హాజరై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి తొలగించిన పింఛన్లు ఎందుకు పునరుద్ధరించడం లేదని ఎంపీడీవో వెంకటరమణను నిలదీశారు. జిల్లా అధికారుల నుంచి తనకు స్పష్టమైన వివరణ వచ్చేంతవరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. జిల్లా అధికారులు తనకు అందుబాటులోకి రావడం లేదంటూ ఎంపీడీవో వెంకటరమణకు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ మీడియాతో మాట్లాడారు. మండలంలో ఎటువంటి విచారణ లేకుండా వందలాది మందికి పింఛన్లు తొలగించారని అన్నారు. ఇదే విషయమై ప్రశ్నించిన నాయకులపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన పై అధికారులు నవశకం సర్వేలో భాగంగా ఈనెల 30వ తేదీలోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఆయన నిరసన విరమించారు.