తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును.... అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేయడం.... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటికి ఉదయం 7.30 గంటలకు వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లు, ఇతర వ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. పోలీసులు వారితో రాగా... కొందరు గోడదూకి అచ్చెన్న ఇంట్లోకి ప్రవేశించారు. రాగానే ఇంట్లోవాళ్ల ఫోన్లు లాగేసుకుని... ఐదు నిమిషాల్లోనే అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలో... అచ్చెన్న వెంట గన్‌మ్యాన్‌నూ కూడా అనుమతించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
దర్యాప్తులో తేలింది...అందుకే అరెస్ట్ చేశాం..
ఉదయం ఏడున్నరకి అచ్చెన్నను అరెస్టు చేశామని అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ విశాఖలో మీడియాకు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా.. మందులు, కొన్నిరకాల పరికరాలు కొనుగోళ్లు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం రూపొందించిన నివేదికను ప్రభుత్వం తమకు సిఫారసు చేసిందని... దానిపై దర్యాప్తులో లభించిన ఆధారాలతో అచ్చెన్నతో పాటు ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇదే కేసులో రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ విజయకుమార్‌ను తుమ్మలోవలో... మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను.. తిరుపతి బైరాగిపట్టెడలోని నివాసంలో అరెస్టు చేశారు. గతంలో కడప ఈఎస్ఐ ప్రాంతీయ కార్యాలయంలో జేడీగా పనిచేసిన జనార్ధన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
జగనే బాధ్యత వహించాలి: చంద్రబాబు
అచ్చెన్నాయుడి అరెస్ట్‌కి జగన్‌నే బాధ్యత వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలకు అదుపు లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ దోపిడీకి అడుగడుగునా... అడ్డు పడుతున్నామన్న అక్కసుతోనే.... అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధిగా ఉన్న అచ్చెన్న పట్ల.... పోలీసులు ప్రవర్తించిన తీరు గర్హనీయన్నారు. విజిలెన్స్ నివేదికలో అచ్చెన్నాయుడు పేరే లేదన్న చంద్రబాబు.... కేవలం అవమానించడానికే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడికి మద్దతుగా రాష్ట్రమంతటా శనివారం తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు.