శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సహా పలువురు తెదేపా సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. జిల్లా తెదేపా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మల్లా బాలకృష్ణ, పలు మండలాల తెదేపా అధ్యక్షులు, ముఖ్యనేతలు పరామర్శించిన వారిలో ఉన్నారు.
అసలేం జరిగింది...
తెదేపా శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్టు చేయడంతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడింది. ఉదయం 7.20గంటలకు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది ఆయన ఇంటిని చుట్టుముట్టారు. గేటుకు తాళం వేసి ఉండటంతో రక్షణగోడను దూకి రెండో అంతస్తులో ఉన్న ఆయన గదికి నేరుగా ప్రవేశించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు వచ్చే సమయానికి ఆయన భార్య స్నానపు గదిలో ఉండగా, ఆమె వచ్చేంతవరకు ఆగాలని, ముందురోజే శస్త్రచికిత్స జరిగినందున తన మందులు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లినట్లు అచ్చెన్నాయుడు భార్య విజయమాధవి తెలిపారు. క్షణాల్లో సంఘటన జరిగిందని ఆమె చెప్పారు.