రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నేతన్న నేస్తం పథకం.. చేనేత కార్మికుల నేస్తం కాదని, అది నేతన్న మోసం అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. చేనేత పని చేస్తున్న కార్మికులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో చేనేత కార్మికులు - జరుగుతున్న మోసాలు అనే అంశంపై నిర్వహించిన ర్యాలీలో కళా వెంకట్రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చేనేత కార్మికులకు అందిస్తున్న సహాయం.. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడం దారుణమని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన కొనసాగడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను ఇప్పటివరకూ పట్టుకోలేదని మండిపడ్డారు. తన ఇంట్లోనే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.