గుంటూరు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని... తెదేపా గుంటూరు పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి అన్నారు. పాస్టర్ మల్లెల రాజు చేతిలో మోసపోయిన బాధితురాలిని కలిసి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. పాస్టర్పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. బాధితురాలికి ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆరోపించారు.
మహిళలకు అన్యాయం జరిగితే 5 నిమిషాలలో న్యాయం చేస్తామని చెప్పిన దిశ చట్టాలు ఎక్కడికి వెళ్లాయని ఆమె ప్రశ్నించారు. జిల్లాలొనే హోం మంత్రి ఉన్నా మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళ కమిషన్ చైర్ పర్సన్ ఎక్కడ ఉన్నారో.. ఆమె ఎవరికి న్యాయం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. వరుసగా మహిళలపైన దాడులు జరుగుతున్నా అధికార పార్టీ నేతలు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే పాస్టర్ మల్లెల రాజును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.