Parents protest against the Merger of schools: రాష్ట్రంలో బడిగంట మోగింది. అయితే అనేక చోట్ల పాఠశాలలకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే.. పాఠశాలల విలీనంపై ఆందోళన చేశారు. మా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం వద్దంటూ నిరసనకు దిగారు. పాత పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలోని మోగిలపాడు ప్రాథమికోన్నత పాఠశాలను.. పలాస జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేయవద్దంటూ.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేశారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం శుభలై ఆర్.ఆర్. కాలనీ ప్రభుత్వ పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మద్దతు తెలిపారు.
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలోని ఆర్.సి.ఎం. పాఠశాలను ప్రభుత్వం మూసివేయడంతో.. రహదారిపై బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ పాఠశాలను ముదిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు. ఉపాధ్యాయుల్ని బయటికి పంపి పాఠశాల గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా గలగల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను... గొల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో స్థానికులు ఆందోళన చేశారు.