శ్రీకాకుళం జిల్లాల్లో పుష్కలమైన సాగునీటి వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఏటా నానాపాట్లు పడుతున్నారు. తూతూమంత్రంగా చేస్తున్న పనుల్లో నాణ్యత లోపం కారణంగా సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ కోవలోకే వస్తోంది.. నారాయణపురం ఆనకట్ట. నాగావళి నదిపై అరవై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. జిల్లాలోని ఏడు మండలాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టును కాపాడే ప్రభుత్వం కోసం ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో.. తెదేపా ప్రభుత్వం నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణకు ముందుకు వచ్చింది. రెండేళ్ల కిందట (జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ) జైకా నిధులు మంజూరు చేసింది. దీంతో ఆనకట్ట పరిస్థితి మారుతుందని.. సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు ఆశ పడ్డారు. కానీ పనులు పూర్తి చేసేందుకు వచ్చే నెలతో గడువు ముగియనుంది. అయితే నేటికీ 4 శాతం పనులు మాత్రమే పూర్తవడం.. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శం.
గతేడాది ఆధునికీకరణ పనులు ప్రారంభం
నారాయణపురం ఆనకట్ట పరిధిలోని శ్రీకాకుళం, గార, సంతకవిటి, పొందూరు, బూర్జ, ఆమదాలవలస, ఎచ్చెర్ల మండలంలోని... 92 గ్రామాల్లో 37 వేల 53 ఎకరాలకు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరందుతోంది. అర్థశతాబ్దం ముందు నిర్మించిన ఆనకట్టతో పాటు కుడి, ఎడమ కాలువలు శిథిలావస్థకు చేరుకోవడంతో గతేడాది ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. 2020 ఆగస్టుకల్లా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇంకా పనులు ప్రారంభదశలోనే ఉండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు పూడిక తీత, మట్టి పనులు మాత్రమే చేపట్టారు. శాశ్వత పనులకు శ్రీకారం మొదలవ్వలేదు. ఇంతలో ఖరీఫ్ సీజన్ రావడంతో ఆనకట్ట అభివృద్ధి పనులు నిలుపదల చేశారు. సాగునీరు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో... ఆనకట్ట నుంచి అధికారులు సాగునీరు విడుదల చేశారు.
సాంకేతిక పరమైన అనుమతి లభించింది
ఆనకట్ట ఆధునికీకరణ పనులకు ఏ ప్యాకేజీ కింద రూ.62 కోట్ల 46 లక్షలు, బీ ప్యాకేజీ కింద రూ.49 కోట్ల 64 లక్షలతో పనులు చేపట్టేందుకు విశాఖపట్నం చీఫ్ ఇంజనీర్ నుంచి సాంకేతిక పరమైన అనుమతి లభించింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకొని పనులు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఆనకట్ట కుడి కాలువలో 20 కిలో మీటర్లు, ఎడమ కాలువలో 19 కిలో మీటర్లు మేరమట్టి పనులు చేశారు. రెండు కాలువలకు సంబంధించి కాంక్రీట్ పనులకు సాంకేతిక పరమైన డిజైన్లు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 4 శాతం పనులు పూర్తయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కాలువల ఆధునికీకరణ పనులు చేసేందుకు ఏటా జనవరి నుంచి అవకాశమున్నప్పటికీ అధికారులు ప్రతి ఏడాది జూన్, జూలై నెలల్లో పనులు ప్రారంభిస్తున్నారని.. ఫలితంగా పనుల్లో జాప్యం జరుగుతోందని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయకట్టుకు నీరు అందడం గగనమైపోయింది. దీంతో కాలువలను చూస్తే రైతు కంట కన్నీరే వస్తోంది.