శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పోలీసులు కరోనా నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కొవిడ్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమనీ.. చదువుకున్నవారు సైతం నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా.. మాస్క్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖ జిల్లాలో...
కరోనా పోయిందనే భావనలో చాలా మంది ఉన్నారనీ... ఈ విధమైన ధోరణి సరైనదని కాదని విశాఖ జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించాలని సూచిస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ.. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాస్కు లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు.. మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని కోరారు.
కృష్ణా జిల్లాలో...
మాస్క్ పెట్టు.. లేదంటే చలానా కట్టు అంటూ కృష్ణా జిల్లా గన్నవరం సర్కిల్ పరిధిలో.. మాస్క్ ధరించటంపై పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్క్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారి వద్ద నుంచి రూ. 70 చొప్పున చలానా వసూలు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లాలో...
మాస్క్ లేకుండా తిరిగితే.. కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందో.. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్ వద్ద రహదారిపై.. మాస్క్ లేకుండా ఉన్నవారికి మాస్కులు అందజేశారు. ఇకపై మాస్క్ లేకుండా కనిపిస్తే.. జరిమానా తప్పదని హెచ్చరించారు.