ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక్కడ శివుడు... శ్రీముఖుడు! - శ్రీకాకుళంలో శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం తాజా వార్తలు

పరమేశ్వరుడు అనగానే ఎవరికైనా శివలింగమే గుర్తొస్తుంది. కానీ శ్రీకాకుళంలోని ఓ ఆలయంలో మాత్రం స్వామి ముఖరూపంలో దర్శనమిస్తాడు. అరుదైన ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం.

srimukhi lingam temple at jalamaur zone
శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం

By

Published : Oct 4, 2020, 2:15 PM IST

చక్కని శిల్పకళా నైపుణ్యంతో... ఎన్నో ప్రత్యేకతలతో కనిపిస్తూ దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయం శ్రీకాకుళంలోని జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోకి కాళ్లు కడుక్కోకుండానే వెళ్లిపోవచ్చు. ఇక్కడ భక్తులు చప్పట్లు కొడితే నందీ, చండీ విని భక్తులు వచ్చినట్లు స్వామికి చెబుతారని అంటారు. గంధర్వులకు శాపవిమోచనాన్ని కలిగించేందుకు స్వయంభువుగా వెలసిన ఈ స్వామిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని స్కంద పురాణంలో ఉంది.

స్థల పురాణం

శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం
ద్వాపర యుగంలో వామదేవ మహర్షి లోకకల్యాణం కోసం యజ్ఞం చేయాలనుకుని దేవతలందరినీ ఆహ్వానిస్తాడట. యజ్ఞం పూర్తయ్యాక ప్రసాద వితరణ సమయంలో గంధర్వులు కనిపించకపోవడంతో మహర్షి దివ్యదృష్టితో చూస్తాడట. గంధర్వులు అక్కడి కొండప్రాంతంలోని కోయజాతికి చెందిన స్త్రీలతో సరదాగా ఉండటం కనిపిస్తుందట. దాంతో మహర్షి గంధర్వుల్ని కూడా కోయజాతివారిలా మారిపొమ్మని శపిస్తాడట. వాళ్లు మన్నించమని అడిగితే కలియుగ ఆరంభంలో శివుడు ముఖరూపంలో స్వయంభువుగా ఆ ప్రాంతంలో వెలుస్తాడనీ ఆ స్వామిని దర్శించుకుంటే శాపవిమోచనం కలుగుతుందనీ చెప్పాడట. ఆ గంధర్వుల రాజు చిత్రసేనుడు. అతనికి ఇద్దరు భార్యలైతే రెండో భార్యది కోయజాతి. కొన్నాళ్లకు వాళ్లుండే ప్రాంతంలోని ఓ పుట్టలో ఏడాది పొడవునా పూలు పూసే విప్పచెట్టు పెరుగుతుంది. రాజు ఆ చెట్టు కొమ్మల్ని రెండు తీసుకుని ఇద్దరు భార్యలకీ ఇచ్చాడట. అయితే శివభక్తురాలైన రెండో భార్యకు ఇచ్చిన కొమ్మకు బంగారు పూలు పూశాయట. రాజు పెద్దభార్యకు అది తెలిసి గొడవకు దిగడంతో విసుగొచ్చిన రాజు ఆ చెట్టును నరికేశాడట. ఆ సమయంలో అతడు మూర్ఛపోవడంతో... రెండో భార్యవల్లే ఇదంతా జరిగిందని భావించి అందరూ ఆమెను చంపాలనుకున్నారట. ఆమె శివుడిని ప్రార్థించడంతో పరమేశ్వరుడు చెట్టు మొదలు భాగంలో శిలగా మారి ముఖంతో కనిపించాడట. అలా స్వామి ముఖాన్ని దర్శించుకున్న గంధర్వులకు శాపవిమోచనం కలిగిందట. ఇదంతా తెలిసిన దేవతలు భూమ్మీదకు వచ్చి ఈ క్షేత్రానికి దగ్గర్లో ఒకటి తక్కువ కోటి లింగాలను ప్రతిష్ఠించారట. అవన్నీ ఇప్పటికీ ఆ చుట్టుపక్కలే ఉన్నాయని అంటారు. అలా ఈ క్షేత్రం శ్రీముఖలింగంగా ప్రసిద్ధి చెందింది.

కోర్కెలు తీర్చే కుండ

శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం
ఏడాది పొడవునా నిత్య పూజలతో కళకళలాడే ఈ ఆలయంలోని స్వామి ముఖాన్ని ఎటునుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ముఖలింగం వెనుక వైపున పెద్ద మట్టికుండ ఉంటుంది. దీన్ని కోర్కెలు తీర్చే కుండ అంటారు. సుమారు 500 ఏళ్ల క్రితం వృద్ధ కుమ్మరి దంపతులు ఈ మట్టికుండను తయారుచేశారని అంటారు. అలాగే పూర్వం ఈ ప్రాంతంలో నీటి కరవు ఉండేది. దాంతో అప్పటి రాజు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గంగా యమునలు, గుమ్మం వద్ద సరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించాడట. అదేవిధంగా ద్వారానికి ఇరువైపులా నోటితో చేపలు పట్టుకున్న రెండు మొసళ్ల విగ్రహాలూ కనిపిస్తాయి. వీటిని దాటితే కాళ్లు కడుక్కోనక్కర్లేదని అంటారు. ఆలయ ఆవరణలో అష్ట దిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలు అష్ట దిక్కుల్లో కనిపిస్తాయి. గుడి మూసేసినా భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాన ఆలయానికి ముందువైపు కూడా స్వామి విగ్రహం ఉంటుంది. ఈ గుడికి కొంత దూరంలో పద్మనాథగిరిపైన క్షేత్ర పాలకులైన కృష్ణార్జునుల ఆలయం ఉంటుంది.

ఎలా చేరుకోవచ్చంటే...
శ్రీకాకుళం నుంచి రోడ్డు, రైల్వేస్టేషన్‌ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇదీ చూడండి.

తిరుమలలో పెరిగిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details