శ్రీకాకుళం జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో వైకాపా గాలి బలంగా వీచింది. తెదేపా ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న జిల్లాలో ప్రజలు ఈసారి వైకాపాకే పట్టం కట్టారు. మొత్తం10 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిదింటిలో విజయఢంకా మోగించింది. 2014లో తెదేపాకు 7 స్థానాల్లో విజయం సాధించగా.. ఈ సారి కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
ఎచ్చెర్ల...
తెదేపా అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావ్ కి ఈ సారి చుక్కెదురైంది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు షాకిచ్చారు. ఫలితంగా వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ చేతిలో ఓటమిని చవి చూశారు.
టెక్కలి...
జిల్లాలో అత్యంత ఆసక్తి రేపిన స్థానం టెక్కలి. ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడు..వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్ మధ్య హోరాహోరి పోటీలో ప్రజలు అచ్చెన్నాయుడివైపే మొగ్గు చూపారు.
ఆమదాలవలస...
ఆమదాలవలస నియోజకవర్గంలో విజయం వైకాపాను వరించింది. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కూన రవికుమార్‌కు అనూహ్య పరాభవం ఎదురైంది. వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం చేతిలో కూన ఓటమి పాలయ్యారు.
ఇచ్ఛాపురం...
తెలుగుదేశానికి పెట్టని కోటాల ఉన్న ఇచ్ఛాపురంలో గెలుపుపై తెదేపా-వైకాపాలు గట్టి ధీమాతోనే ఉండగా... విజయం తెదేపానే వరించింది. వైకాపా అభ్యర్థి పిరియ సాయిరాజ్ పై బెందాళం అశోక్ విజయం సాధించారు.
పలాస...
పలాస నియోజకవర్గంలో మందస, పలాస గ్రామీణ ప్రాంతాల్లో అనుకూల ఓటింగ్ జరిగుతుందన్న తెదేపా అంచనా... పలాస పట్టణం తమకే మొగ్గని వైకాపా శ్రేణులు వేసిన లెక్కల్లో.. ఫలితం ఫ్యాన్ వైపు మొగ్గు చూపింది. తెదేపా అభ్యర్థి గౌతు శిరీషపై సీదిరి అప్పలరాజు విజయం ఢంకా మోగించారు.
శ్రీకాకుళం...
శ్రీకాకుళం నియోజవర్గంలో నువ్వా... నేను అనట్టుగా ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. ఈ స్థానంలో గెలుపు కోసం తేదేపా అభ్యర్థి గుండ లక్ష్మీదేవి తీవ్రంగా శ్రమించినా... ప్రజలు మాత్రం వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు వైపే మొగ్గు చూపారు.
రాజాం...
రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి ఆధిక్యం వస్తుందని నమ్మిన తెదేపా ఆశలు అడియాశలయ్యాయి. మరోసారి ప్రజలు... సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే కంబాల జోగులును గెలిపించారు. తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి పరాభవాన్ని మూటగట్టుకున్నారు.
పాలకొండ...
పాలకొండలో వైకాపా గాలి వీచింది. తెదేపా అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై వైకాపా మహిళా అభ్యర్థి వి.కళావతి విజయ దుందుబి మోగించారు. ఓటర్లు ఫ్యాను గాలినే కోరుకున్నారు.
పాతపట్నం...
పాతపట్నం నియోజకవర్గం ప్రజలు వైకాపానే నమ్మకం ఉంచారు. తెదేపా అభ్యర్థి కలమట వెంకటరమణపై వైకాపా మహిళా అభ్యర్థి రెడ్డి శాంతి విజయ ఢంకా మోగించారు.
నరసన్న పేట...
నరసన్న పేట నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గురమణ మూర్తికి చుక్కెదురైంది. వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ చేతిలో బగ్గు రమణ మూర్తి ఓటమి పాలయ్యారు.