దక్షిణ కాశీ.. ఈ శ్రీకాకుళం శ్రీముఖలింగం కాశీలో లింగం... గంగలో స్నానం... శ్రీశైలంలో శిఖరం... శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే... మోక్షం సిద్ధిస్తుందని శాసనాలు చెబుతున్నాయి. అంతటి ప్రాశస్త్యం ఉన్న శైవక్షేత్రాల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలసిన శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం. దక్షిణా కాశీగా విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రం.. భక్తులకు కోర్కెలను తీర్చే పుణ్యస్థలం.
కలియుగ ప్రారంభంలో విప్పచెట్టులో కైలాస నాథుడు స్వయంభుగా ఇక్కడ వెలిశారని ప్రతితీ. గోకర్ణ ఆకృతిలో (ఆవు చెవి ఆకారంలో) శ్రీముఖలింగేశ్వర స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 8వ శతాబ్ధంలో ఆలయ నిర్మాణాన్ని ఒకటో కామార్ణవుడు రాజు నిర్మించారు. 1420 సంవత్సరం నుంచి ఒడిశా రాజులు విష్ణువర్ధన మధుకరణ గజపతి రాజవంశీయులు నేటికీ ఆలయ ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ప్రాచీన శిల్ప సంపద ఉన్న దేవాలయంగా పెరొందింది... ఈ శైవక్షేత్రం.
శ్రీముఖలింగంలో శిల్ప కళా సౌందర్యం చూడ చక్కనిది. దశావతారాలు, శివకేశవులు, అర్ధనారీశ్వరుడు, దత్తాత్రేయుడు, వామనావతారం వంటి శిల్పాలు అబ్బుర పరుస్తున్నాయి. స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఎతైనా కొండపై మహావిష్టువు విగ్రహం వేంకటేశ్వర స్వామిని పోలి ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత. ఆలయానికి నలువైపులా 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రాంతాల్లో శివలింగాలు దర్శనమిస్తుంటాయి. గంగ వంశీయుల కాలంలో శ్రీముఖలింగేశ్వరాలయం, చోళుల హయాంలో భీమేశ్వర, సోమేశ్వరాలయాలు నిర్మించినట్లు శాసనాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయాల్లో నల్లరాతి లింగాలు కనువిందు చేస్తాయి.
సూక్ష్మంలో మోక్షం కలిగించే శివుడు శ్రీముఖలింగేశ్వరుడు. కాశీలో బంగారం దానం చేస్తే ఎంతటి పుణ్యమో.. శ్రీముఖలింగేశ్వరుని దర్శనం అంతటి పుణ్యాన్ని ఇస్తుంది. ఈ శివయ్యను దర్శించుకుంటే మరోజన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆలయ వెనక భాగానే పవిత్ర వంశధార నది ఉంది. శ్రీకాకుళానికి 48 కిలోమీటర్ల దూరంలో ఈ శైవ క్షేత్రం ఉంది.
ఇదీ చదవండి: చేపల చెరువులు.. కాలుష్యానికి ఆవాసాలు