శ్రీకాకుళం... ఉద్ధండులైన నాయకులను అందించిన జిల్లా. గల్లీ నుంచి దిల్లీ వరకు చక్రం తిప్పే స్థాయి నేతలున్న జిల్లా. గౌతు లచ్చన్న నుంచి ఎర్రన్నాయుడు వంటి హేమాహేమీ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. తెదేపా ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా 2014లోనూ ఆ పార్టీకే పట్టం కట్టింది. ఈసారి రాబోయే ఫలితాలు ఏ పార్టీ వైపు నిలవనున్నాయి. సార్వత్రిక పోరులో విజయం ఎవరిని వరించనుంది. సిక్కోలు సమరంలో నిలిచి గెలవబోయదెవరు..?
పది అసెంబ్లీ స్థానాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కిందటిసారి 7స్థానాల్లో తెదేపా, 3 స్థానాల్లో వైకాపా గెలుపొందాయి. ఈసారి మాత్రం నువ్వా-నేనా అన్నట్టుగా తెదేపా, వైకాపాలు పోటీ పడి ఫలితాన్ని ఆసక్తిగా మార్చేశాయి. జిల్లాలో అత్యంత ఆసక్తి రేపుతున్న స్థానం టెక్కలి. ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడు బరిలో ఉంటే.. వైకాపా తరఫున తిలక్ పోటీ పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఏకపక్ష పోలింగ్ తమకు లాభిస్తోందని తెదేపా భావిస్తోంది. తమ పథకాల వైపే ప్రజలు మొగ్గారని వైకాపా ధీమాతో ఉంది.
మరో మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎచ్చెర్లలో తమదే గెలుపని ఘంటాపథంగా చెబుతున్నారు. జి.సిగడాం, లావేర మండలాల్లో మంచి ఆధిక్యం వస్తుందని లెక్కలు వేస్తోంది తెదేపా. ఎచ్చెర్ల, రణస్థలంలో లభించే ఆదరణతో భారీ మెజార్టీతో గెలుస్తామంటోంది వైకాపా.
తెలుగుదేశానికి పెట్టని కోటలా ఉన్న ఇచ్ఛాపురంలో గెలుపుపై తెదేపా-వైకాపాలు గట్టి ధీమాతోనే ఉన్నాయి. ఈ రెండు పార్టీల నుంచి ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు పోటీలో ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అందుకే విజయం ఎవర్ని వరిస్తుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అత్యధికంగా మహిళా ఓట్లు పోలైనందున ఎడ్జ్ తమకే ఉందని తెలుగుదేశం భావిస్తుంటే.... తమ పథకాలకే ఆకర్షితులై ఓట్లు వేశారని జగన్ జట్టు చెబుతోంది.