నౌపడ గ్రామంలో టీ దుకాణం నడుపుకొని జీవనోపాధి పొందే కొంచాడ యుగంధర్, ఉషారాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె స్వాతి తొమ్మిదో తరగతి చదువుతుండగా, రెండో కుమార్తె పల్లవి ఏడో తరగతి చదువుతోంది. అనారోగ్యంతో తల్లి కొద్దినెలల క్రితం చనిపోగా, తండ్రి కూడా కొన్నాళ్ల నుంచి అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకునే స్తోమత లేక ఇటీవల మృతి చెందారు. వీరి దీనగాథపై ఈనాడు-ఈటీవీ భారత్ కథనాలు ప్రచురితం కావడంతో పలువురు చలించిపోయారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. అనాథ పిల్లలకు చేయూత
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన అక్కాచెల్లెళ్లను ఆదుకునేందుకు ఆపన్నహస్తాలు ముందుకొస్తున్నాయి. ఈనాడు- ఈటీవీ భారత్ బాలికల ధీనస్థితిపై కథనాలు ప్రచురితం కావడంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్పందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడిపిస్తున్న శాంతా కల్యాణ ఆనురాగ నిలయానికి వారిని తరలించారు. వారి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ పి. జగన్మోహనరావును కలెక్టర్ ఆదేశించారు.
తల్లిదండ్రుల మృతితో రోడ్డున పడ్డ అక్కాచెల్లెళ్లను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. సంతబొమ్మాళి ఎంపీడీవో రూ.10వేలు, పారిశ్రామికవేత్త పాల వసంతరావు రూ.15 వేలు ఆర్థిక సాయం అందించగా, పలువురు దాతలు, యువత నగదు, నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. బాలికలను దత్తత తీసుకోవడానికి పలువురు ముందుకొచ్చారు. చైల్డ్ లైన్, ఐసీడీఎస్ సిబ్బంది బాలికలను పరామర్శించి అనాథ ఆశ్రమానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ చొరవతో బాలికలకు ఆశ్రయం దొరకడంతో గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
TAGGED:
ఈటీవీ భారత్ ఎఫెక్ట్