ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి వేళ అన్నదాత ఆవేదన - శ్రీకాకుళం తాజా న్యూస్​

రైతు పంట పండించకపోతే దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అలాంటిది.. అన్నదాత ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్మినప్పటికీ.. చేతికి డబ్బులు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేశానికే వెన్నెముకగా నిలుస్తున్న రైతన్నకు.. ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి.. వీరి కంటతడికి కారణమవుతుంది. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

srikakulam-district-farmers-complained-about-non-payment-of-grain
సంక్రాంతి వేళ అన్నదాత ఆవేదన

By

Published : Jan 10, 2021, 5:45 PM IST

ఏటా ఇదే పాట.. ఆరుగాలం అన్నదాతలు పండించే పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడటం, ఆ తర్వాత సొమ్ముల కోసం ఎదురు చూడటం పరిపాటిగా మారింది. ఈ ఏడాది కూడా రైతులను అవే కష్టాలు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్‌లో దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 12 లక్షల టన్నుల వరకు దిగుబడులు వచ్చినట్టు అధికారుల అంచనా. ఈ ధాన్యం కొనేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 253 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. అయినా ఈ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది.. మిల్లర్ల మాయాజాలం, నిబంధనల పేరుతో కోతలు ఇలా ధాన్యమిచ్చిన కర్షకుడు అష్టకష్టాలు పడుతున్నాడు. దీనికితోడు ఇప్పుడు డబ్బులు చెల్లించని దుస్థితి.

  • ఇంకా ఎన్నాళ్లు పడుతుందో..

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందోనని ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఆయా కేంద్రాలకు కాకుండా ఇప్పటికే దళారులకు అమ్ముకున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో తెరిచిన కేంద్రాలకు విక్రయించిన వారికి మాత్రం తిప్పలు తప్పడం లేదు. గతనెల 19 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. ఇలా రూ.307 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. దాదాపు 20 రోజులుగా ధాన్యం సొమ్ములు విడుదల కాకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు పడుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల్లో పండగ వస్తుందని, చేతిలో చిల్లి గవ్వ లేదంటూ ఆవేదన చెందుతున్నారు.

రూ.3.5 లక్షలు చెల్లించాలి

గత నెల 19న మాకివలస సచివాలయం ద్వారా 250 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి ఇచ్చాను. దీనికి సంబంధించి రూ.3.5 లక్షలు రావాల్సి ఉంది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఇపుడు ధాన్యం సొమ్ము ఇవ్వకపోతే ఎలా గడిపేది. ఏటా ఇలా ఇచ్చి అవస్థలు పడుతూనే ఉన్నాం.

- యాళ్ల వేణు, రైతు, మాకివలస

147 బస్తాలు ఇచ్చాను

నా కుటుంబం తరఫున 147 బస్తాలు విక్రయించాను. గతనెల మొదటి వారంలో ధాన్యం నూర్పులు చేసిన వెంటనే కేంద్రాలకు పంపించాం. తీరా మాకు రావాల్సిన రూ.2.25 లక్షలకు పైగా సొమ్ము రాలేదు. దీంతో కూలీలు, బకాయిదారుల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది.

- శిమ్మ లక్ష్మణరావు, నారాయణవలస, కరగాం

అందరికీ చెల్లింపులు చేస్తాం

జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు జరుగుతున్నాయి. ధాన్యం ఇచ్చిన అందరికీ చెల్లింపులు చేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- ఎ.కృష్ణారావు, డీఎం, పౌరసరఫరాల శాఖ

ఇప్పటి వరకు వివరాలు..

జిల్లాలో కొనుగోలు కేంద్రాలు: 253, వరి సాగు చేసిన రైతులు 3,38,969 మంది, ఇప్పటి వరకు విక్రయించిన ధాన్యం 1,68,747 మెట్రిక్‌ టన్నులు, ధాన్యం ఇచ్చినవారు 25,410 మంది, డబ్బులు అందుకున్నవారు 641 మంది, రైతులకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము : రూ.315 కోట్లు, ఇప్పటి వరకు చెల్లించింది రూ.7.45 కోట్లు.

ఇదీ చదవండి:సిక్కోలులో ఆకర్షిస్తున్న మూరెడు తోక గొర్రెలు

ABOUT THE AUTHOR

...view details