శ్రీకాకుళం జిల్లాలో రోజుకు 4 వేల కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 2564 కేసులున్నాయన్న ఆయన.. రోజుకు సరాసరిన 200 కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు కేసులు నమోదు కావడం ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పాతపట్నం, పోలాకి, పాలకొండ, బూర్జ వంటి ప్రదేశాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయన్నారు.
గ్రామాల్లో స్వచ్ఛందంగా వచ్చేవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రుల్లో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా తీవ్రత లేని వారు 80 శాతం ఉన్నారని.. వారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచుతున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 500 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా.. 600మంది కొవిడ్ ఆస్పత్రిలో ఉన్నారని వివరించారు.