Bridge Collapse: శ్రీకాకుళం జిల్లాలోని వంతెనలకు అధికారుల నిర్వహణ లోపం శాపంగా మారింది. గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ బరువు తట్టుకోలేక ఇటీవలే ఇచ్ఛాపురం నుంచి పలాస వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వందేళ్ల నాటి బహుదా వంతెన కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెనపైగానీ, చుట్టుపక్కల ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిర్వహణ కొరవడటంతో వంతెన శిథిలావస్థకు చేరిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో చాలా చోట్ల.. ప్రధాన రహదారులపై ఉన్న వంతెనలు కూలిపోయే పరిస్థితుల్లో ఉండటం.. మరింత భయాందోళనకు గురిచేస్తోంది.
ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద 22 ఏళ్ల క్రితం నిర్మించిన ఉప్పుటేరు వంతెన కూడా శిథిలావస్థకు చేరింది. వంతెనకు ఇరువైపులా సుమారు 14 మత్స్యకార గ్రామాల ప్రజలు నిత్యం దీనిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఏళ్లుగా ప్రభుత్వ అధికారుల నిర్వహణ సరిగ్గా లేక.. వంతెన శిథిలావస్థకు చేరింది. స్తంభాలు ఎప్పుడు కుప్పకూలతాయోననే భయం వ్యక్తమవుతోంది.
పాతపట్నం నియోజకవర్గంలోని అలికాం-బత్తిలి మార్గంలో బ్రిటిష్ కాలంనాటి వంతెన పడిపోయే స్థితిలో ఉంది. నదీ ప్రవాహానికి కోతకు గురైన గోడల నుంచి పెచ్చులూడిపడుతున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం కుంకులూరు-డెప్పూరు రహదారిపై 5 దశాబ్దాల క్రితం నిర్మించిన రాకాసిగడ్డ వంతెన కూడా శిథిలావస్థకు చేరింది. 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన వారధికి ఈ దుస్థితి పట్టింది. ఇలాంటి అనేక వంతెనలు జిల్లాలో శిథిలావస్థకు చేరినా.. వాటి మరమ్మతులపై దృష్టి పెట్టకుండా.. ప్రభుత్వం, అధికారులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ.. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.