Srikakulam-Amudalavalasa road on Huge potholes: శ్రీకాకుళం- ఆముదాలవలస రోడ్డు పేరు వింటేనే రెండు నియోజకవర్గాల ప్రజలు, వాహనదారులు హడలెత్తిపోతున్నారు. రోడ్ల విస్తీర్ణం పేరుతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందా? అని కూలీలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 కిలోమీటర్ల ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నా.. ఏపీ శాసన సభ స్పీకర్, రెవెన్యూ శాఖ మంత్రి పట్టించుకోరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాకుళం పట్టణం నుండి ఆముదాలవలస రైల్వే స్టేషన్ సమీపం వరకు ఉన్న దాదాపు 10 కిలోమీటర్ల ప్రధాన రహదారిని నాలుగు వరుసలుగా విస్తీర్ణం చేసేందుకు 2021 డిసంబర్ నెలలో రూ. 40 కోట్ల రూపాయల అంచనాలతో 24 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఇప్పటికీ 14 నెలలకు పూర్తి అవుతున్న ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితిలో స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు ఏపీ శాసన సభ స్పీకర్, మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి నియోజకవర్గాలను కలుపుతూ ఉన్న ప్రధాన రహదారి దుస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతున్నా.. ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజల మీద ఎంత మాత్రం ప్రేమ లేదా.. స్పీకర్ తమ్మినేని సీతారాం, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిదంటే.. ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించినా పేద ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. పేద ప్రజలను, రోడ్ల సమస్యలను ఖచ్చితంగా పట్టించుకోవాలి. ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోని.. ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎవరి కోసం ప్రభుత్వం పని చేయాలి? రోడ్డు బాగోలేక నిత్యం నరకం చూస్తున్నాము. కూలీ పని చేసుకోవడానికి రోడ్డుపై ఆటోలో వెళ్తే, గుంతల కారణంగా శరీరమంతా నోప్పులు వచ్చి అనారోగ్యాల బారిన పడుతున్నాము. దుమ్ము, దూళీతో నిత్యం నరకం చూస్తున్నాము.-కళ, ఆముదాలవలస