శ్రీకాకుళం జిల్లాలో సుమారు 2 వేల మంది సాగుదారులు, 10 వేల మంది కార్మికులు ఈ రంగంపై పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. అధికార, అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఏటా రూ.100 కోట్ల వరకు టర్నోవర్ ఉంటుంది. వ్యవసాయ రంగం తర్వాత జిల్లాలో ఈ రంగానికి కాలానుగుణంగా రైతులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో రక్కసి కల్లోలానికి ఈ రంగం తీవ్రంగా నష్టపోతూనే ఉంది. కరోనా రెండో దశ వ్యాపారాన్ని మరింత దిగజార్చింది.
ప్రశ్నార్థకంగా భవిష్యత్తు
ప్రస్తుతం ఆక్వారంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పెరిగిన మేతల ధరలు, మందులు, లీజులతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో దళారులు ధరలు తగ్గించేస్తుండడంతో లాభం మాట అటుంచితే పెట్టుబడి అయినా వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. ఒడుదొడుకులను తట్టుకోలేక సాగుదార్లు ఇతర రంగాలపై దృష్టి సారిస్తున్నారు.
గతేడాది కొవిడ్ ప్రభావంతో ఇదే రోజుల్లో ఎగుమతులు నిలిచిపోగా దానిని ఎగుమతిదారులు సొమ్ము చేసుకున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు రొయ్యలను కొనుగోలు చేసుకుని శీతల గిడ్డంగుల్లో భారీగా నిల్వ చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అధిక ధర వచ్చినప్పుడు సరకును విక్రయించి రూ.కోట్లలో లాభాలు గడించారని ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.