ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపైనా ఆదిత్య కిరణాలు సూర్యనారాయణుడిని చేరునా? - అరసవల్లి సూర్యనారాయణ స్వామి తాజా వార్తలు

భానుడి లేలేత కిరణాలు ఆ సూర్య నారాయణుని తాకిన క్షణాలను చూసిన వారికి ఆనందదాయకం.. ఆరోగ్యప్రదాయకం. బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్న ఆ రవి కిరణాలు.. స్వామి పాదాలను చేరటంతో దేదీప్యమానంగా వెలిగిపోతాడు. ఏటా రెండుసార్లు కనిపించే ఈ అద్బుత దృశ్యాన్ని వీక్షించాలని భక్తులు ఆరాటపడుతుంటారు.

Arasavalli Surya Narayana swami temple
రేపైన ఆదిత్యుని కిరణలు సూర్యనారాయణుని చేరునా?

By

Published : Mar 9, 2021, 10:06 PM IST

రేపైనా ఆదిత్య కిరణాలు సూర్యనారాయణుడిని చేరునా?

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఏడాదిలో రెండు పర్యాయాలు సూర్యనారాయణని చేరే అద్భుత దృశ్యం ఆవిష్కృతమౌతుంది. దీనినే కిరణస్పర్శ అంటారు. ఉషాపద్మినీచ్ఛాయ సమేత సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌ పాదాల నుంచి శిరస్సు వరకు ఆదిత్యుడు తాకుతాడు. గాలిగోపురం నుంచి ఆలయ అనివెట్టి మండపం గుండా ధ్వజస్తంభం ద్వారా సుదర్శన ద్వారం మధ్యలో నుంచి తొలికిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలను స్ప్శశించి... అటుపై శిరస్సును చేరతాయి. ఈ సమయంలో ఆ సూర్యనారాయణని దర్శించుకున్న భక్తులకు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10 తేదీల్లో.. అలాగే అక్టోబరు 1, 2 తేదీల్లో స్వామిని కిరణాలు తాకుతాయి. మార్చి నెలలో ఉదయం 6 గంటల 20 నిమిషాల ప్రాంతంలో.. అక్టోబరు నెలలో తెల్లవారు 6 గంటల సమయంలో ఈ అపురూప సుందర దృశ్యం ఆవిష్కృతమౌతుంది.

సర్వరోగ నివారిణి..

ఈ కిరణాలను వీక్షిస్తే భక్తులకు చర్మ, హృద్రోగ వ్యాధులు రాకుండా ఉంటాయని.. నేత్రాల సంబంధిత వ్యాధులు రావని నమ్మకం. వీటిని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే భానుడు చేసిన ప్రయత్నానికి మేఘం అడ్డుపడితే కిరణాలు రావు. తరచూ కిరణాలకు మేఘాల అడ్డంకి వచ్చి పడుతుండటంతో భక్తులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అయితే రేపు కూడా కిరణాలు పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

దేవతల కాలమానం...

సూర్యుడు సంవత్సరంలోని ఆరు నెలలు దక్షిణం వైపు... మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తుంటారు. భూమిపై రాత్రి, పగలు ఎలా ఉన్నాయో... అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని నమ్మకం. సూర్యుడు భూమిపై దక్షిణం వైపు ప్రయాణిస్తున్నంతకాలం దేవతలకు రాత్రిగా, ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నంతకాలం పగలుగానూ ఉంటాయట. ఈ ప్రయాణించడాన్నే ఆయణం అంటారు. ఉత్తర ఆయణమంటే ఉత్తరం వైపు పయనించటం అని అర్థం. దక్షిణం వైపు పయనిస్తే అది.. దక్షిణాయణం. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు వస్తుంటాయి.

రేపైనా మోక్షం కలుగునా?

సూర్యకిరణాలకు ఎంతో ప్రసిద్ధి ఉండటంతో... వీటిని చూసేందుకు భక్తులు అధికసంఖ్యలో వస్తారు. కిరణాలు స్వామిని తాకే సమయంలో భక్తులు దర్శించుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తారు. నేడు ఆకాశంలో మేఘాలుండటం వల్ల కిరణాలు తాకలేదు. రేపు ఉదయం సూర్య కిరణాలు స్వామివారి పాదాలు తాకే అవకాశం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.


ఇదీ చదవండీ..కనుల పండువగా.. సత్తెమ్మ తల్లి జాతర

ABOUT THE AUTHOR

...view details