Tammineni Sitaram Started The Family Doctor Program : ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా గడప వద్దకే వైద్య సేవలు అందించనున్నామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కలుగులవలస గ్రామంలో గురువారం స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.
గడప గడపకు వైద్య సేవలు :ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రారంభించారన్నారు. ఒక నెలలో ఓ గ్రామ పరిధిలో రెండు పర్యాయాలు వైద్యులు సందర్శించి ప్రతి గడపకు వైద్య సేవలు అందిస్తారని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ట్రైల్ రన్ విజయవంతం :వైయస్సార్ హెల్త్ క్లినిక్ లో 14 రకాల టెస్టులు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని స్పీకర్ అన్నారు. ఈ కార్యక్రమం కోసం ఈ నాలుగు సంవత్సరాలలో 49 వేల వైద్య సిబ్బంది నియమించారన్నారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్దితో పని చేస్తున్నారని శాసన సభాపతి అన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైందని తెలిపారు.