Speaker Tammineni Fire On Govt Officials: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే.. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతానని సభాపతి తమ్మినేని సీతారాం హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా గోపిదేవిపేటలో పర్యటించిన సభాపతి.. మదనాపురం కూడలిలో ప్రభుత్వ స్థలం ఆక్రమణపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, జగనన్న కాలనీలకు స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో భూ ఆక్రమణలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని.. అధికారులను సభాపతి నిలదీశారు. వెంటనే ప్రభుత్వ స్థలాలను ఆధీనంలోకి తీసుకోకపోతే.. తాను అక్కడే బైఠాయిస్తానని స్పష్టం చేశారు.
"ప్రభుత్వ భూములు ఆక్రమించే వారిపై కేసులు పెట్టండి. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. జగనన్న కాలనీలకు స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. భూ ఆక్రమణలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. వెంటనే ప్రభుత్వ స్థలాలను ఆధీనంలోకి తీసుకోవాలి. లేకుంటే అక్కడే బైఠాయిస్తా" -తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్