శ్రీకాకుళం జిల్లా గార మండల వ్యాప్తంగా కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాయుగుండం రాకమునుపు కేవలం 374.6 మి.మీ. వర్షం మాత్రమే కురవడంతో 32.4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కొర్ని, కొర్లాం, కొమరవానిపేట, తోణంగి, ఒమరవల్లి, కళింగపట్నం పంచాయతీల పరిధిలోనే వర్షాల్లేక ఎక్కువ మంది రైతులు పంట వేయలేకపోయారు. ఈ ఏడు కూడా 4,800 ఎకరాల్లో పంట ఎండిపోయింది. సమయం తక్కువగా ఉండడంతో మరో పంట వేసే ఆస్కారం కూడా లేదు. కేవలం రోజుల వ్యవధిలోనే 249.4 మి.మీ వర్షపాతం నమోదైంది. కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఈ వర్షం ఏ విధంగానూ ఉపకరించలేదు.
అక్టోబరు 12వ తేదీకి ముందు.. జిల్లాలోని అధికశాతం మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణుడి కోసం వేయికళ్లతో వేచిచూసి చివరికి ఆశలు వదిలేసుకున్నాడు అన్నదాత.. కొంత మంది చేనును కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. అయితే వాయుగుండం కారణంగా జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. కాని ఈ వర్షపునీరు ఎందుకూ పనికిరాకుండానే పోయింది. గతంలో వర్షాల్లేక పంట ఎండిపోతే ఇప్పుడు ఉన్న పంట వాన ధాటికి మునిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేలు చేయకపోగా కొన్ని మండలాల్లో ఈ వానలు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలతో రైతులు మరింత చితికిపోయారు. కనీసం 20 శాతం వర్షం కూడా పంటలకు ఉపయోగపడలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఉపయోగపడితే మేలు జరిగినట్లే అనుకున్నా అదీ లేదు. గతంలో వర్షాలు లేక ఎండిపోయిన పంట కాక మిగిలినవి ఈ భారీ వర్షాలకు మునిగిపోయాయంటున్నారు. మరోపక్క కురిసిన వర్షాల్లో చుక్క నీటినీ ఒడిసిపట్టుకోలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది.
నీరంతా సముద్రం పాలే...