విశాఖ జిల్లా చోడవరంతిమ్మన్నపాలెం పంచాయతీ సర్పంచిగా గొర్లె రాము ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. ఈయన ఉన్నత విద్యావంతుడు. సర్పంచి పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. వైకాపాకు చెందిన రాము గ్రామాభివృద్ధికి రూ. మూడు లక్షలు తన వంతు విరాళంగా ఇచ్చేందుకు సమ్మతిని తెలిపారు. ఎనిమిది వార్డులుండగా తెదేపా, వైకాపా నాయకులు తలో నాలుగు వార్డులను పంచుకున్నారు. ఉప సర్పంచి పదవిని తెదేపాకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
బుచ్చెయ్యపేట ;కె.పి.అగ్రహారంలో వైకాపా మద్దతుదారుడు గోపిశెట్టి శ్రీనివాసరావు, చినమదీనా సర్పంచిగా వైకాపాకి చెందిన పచ్చికూర మంగవేణి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. చినమదీనాలో ఎనిమిది వార్డులు ఉండగా అయిదు వైకాపా, మూడు తెదేపా మద్దతుదారుల చేత నామినేషన్లు వేయించారు.
కశింకోట:గురువుభీమవరం పంచాయతీ ఏకగ్రీవం చేయడానికి గ్రామపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సర్పంచిగా హనుమంతు వెంకట లక్ష్మణరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి నిర్ణయించారు. గ్రామాభివృద్ధికి తమ సొంత నిధులు రూ.8 లక్షలు వెచ్చిస్తానని హామీ ఇవ్వడంతో ఏకగ్రీవం చేశారు. వైకాపా నుంచి నలుగురు, తెదేపా, జనసేన నుంచి ముగ్గురు చొప్పున వార్డులకు నామినేషన్లు వేశారు. దీనిని అధికారికంగా ప్రకటించవలసి ఉంది.
మాడుగుల గ్రామీణం:ఒమ్మలి గ్రామ పంచాయతీ నుంచి ఎం.కృష్ణాపురం నూతనంగా పంచాయతీ ఏర్పాటైంది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఎనిమిది వార్డుల్లో తెదేపా నాలుగు, వైకాపా నాలుగు మద్దతుదారులు, సర్పంచి పదవికి వైకాపా మద్దతుతో మొల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ మాత్రమే వేశారు.
చీడికాడ :జె.బి.పురం, పెదగోగాడ పంచాయతీలో సర్పంచి, వార్డు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.