ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

7 DIED IN ROAD ACCIDENT: ఏడుగురిని మింగేసిన రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి - ఏపీ తాజా వార్తలు

7 DIED IN CHITTOOR ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదం వారి పాలిట శాపంగా మారింది. కుటుంబం మొత్తాన్ని మృత్యువు వెంటాడి బలితీసుకుంది. కానీ ఓ చిన్నారి అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. దీంతో శ్రీకాకుంళం జిల్లాలోని సంతకవిటి మండలం మేడమర్తి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

7 died in road accident
7 died in road accident

By

Published : Dec 6, 2021, 1:16 AM IST

Updated : Dec 6, 2021, 9:13 AM IST

ఏడుగురిని మింగేసిన రోడ్డు ప్రమాదం

7 DIED IN ROAD ACCIDENT: ఇంట్లో అన్ని శుభకార్యాలు చేసినట్లే.. చిన్నకుమార్తె పుట్టువెంట్రుకలూ తిరుపతిలోనే తీయించాలనుకున్నారు. రెండు కుటుంబాలు కలిసి బయల్దేరాయి. కానీ దైవదర్శనం కాకముందే దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారులో మంటలు చెలరేగి ఘటనాస్థలిలో ఐదుగురు, రుయా ఆస్పత్రిలో మరో ఇద్దరు మరణించారు. రెండేళ్ల చిన్నారి మాత్రమే ఈ ప్రమాదంలో బతికి బయటపడింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 8 మంది ఒకే కారులో శుక్రవారం బయలుదేరారు. ఆరునెలల చిన్నారికి పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చేందుకు బయల్దేరిన వీరు ఆదివారం ఉదయం తొలుత కాణిపాకం వెళ్లి అక్కడినుంచి తిరుపతి వస్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన వీరి వాహనం ఐతేపల్లె వద్ద ఆరు లేన్ల రహదారి మలుపులో అదుపుతప్పి కల్వర్టు గోడను ఢీకొంది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమిర్తికి చెందిన కంచరపు సురేష్‌కుమార్‌ (36), ఆయన భార్య మీనా (30), కుమార్తె జస్మిత (6 నెలలు), తండ్రి శ్రీరామ్మూర్తి (71), తల్లి సత్యవతి (58), మామ గోవిందరావు (61) మరణించారు. సురేష్‌ అత్తమామలు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందినవారు. సురేష్‌ తండ్రి రామ్మూర్తి, అత్త హైమావతి (51) తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సురేష్‌ పెద్ద కుమార్తె.. రెండేళ్ల జషిత మాత్రమే ప్రాణాలతో మిగిలింది.

ఒకే కారులో 8 మంది..

ఒకే వాహనంలో 8 మంది ప్రయాణించడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని భావిస్తున్నారు. ఈ రహదారిలో గరిష్ఠ వేగం 80 కి.మీ. దాటకూడదు. ప్రమాద సమయంలో వేగం 120 కి.మీ. ఉందని రవాణా శాఖ అధికారులు గుర్తించారు. అదనపు ఎస్పీ సుప్రజ క్షతగాత్రులను ఆస్పత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. అతి వేగంతో పాటు రహదారి మలుపు, ఇక్కడ క్రాస్‌ బారికేడ్‌ లేకపోవడం ప్రమాదానికి కారణం కావొచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. ఆరు వరుసల రహదారిలో ఐతేపల్లె వద్ద నిర్మాణం సరిగా లేకపోవడం వల్లే కల్వర్టు దిమ్మెను కారు వేగంగా ఢీకొనడంతో ఇంజిన్‌ పేలిపోయి మంటలు చెలరేగాయి. కల్వర్టుకు ఉన్న దిమ్మె పక్కకు పడిపోయింది. ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టరు తిరుపతి పోలీసులతో సంప్రదించి మృతదేహాలను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎగిసిపడిన మంటలు

ప్రమాదం తర్వాత కారు నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెట్రోలు కారు కావడంతో మరింత ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే చేరుకుని, బాధితుల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించారు. ముగ్గురు కారులోనే మంటల్లో ఇరుక్కుపోయారు. వాహనం కల్వర్టును ఢీకొన్నప్పుడు డోర్లు తెరుచుకుని మరో ఐదుగురు బయటపడ్డారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలి వద్దే మరణించారు. ఇద్దరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు.దేవుడి దగ్గరకే వెళ్లిపోయారు!

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమిర్తికి చెందిన కె.సురేష్‌కుమార్‌ విశాఖలో మెరైన్‌ ఇంజినీరు. 6నెలలు ఉద్యోగం.. 6నెలలు సెలవు. చిన్న కుమార్తె జస్మిత పుట్టువెంట్రుకలు తీయించేందుకు తన కుటుంబంతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలతో కలిసి బయల్దేరారు. గురువారం మేడమిర్తి నుంచి వచ్చి పేరాపురంలో బసచేశారు. మర్నాటి ఉదయం 10 గంటలకు అక్కడి నుంచే వెళ్లారు. ఐతేపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో జషిత మినహా అంతా మరణించారు.

డ్రైవరును తీసుకెళ్లాలని చెప్పినా..

ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుండగానే గోవిందరావు ఇప్పుడు వద్దని, తిరుపతిలో కొండచరియలు విరిగిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, కొద్దిరోజులు ఆగి వెళ్దామని చెప్పారు. ఇప్పుడే వెళ్దాం అన్న అల్లుడి మాట కాదనలేక అప్పటికప్పుడు బయల్దేరారు. డ్రైవరును తీసుకెళ్లాలని సన్నిహితులు వారించినా సురేష్‌ వినిపించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

చిరంజీవి.. ఈ చిన్నారి

ఈ ప్రమాదంలో సురేష్‌కుమార్‌ పెద్దకుమార్తె రెండేళ్ల జషిత మాత్రమే ప్రాణాలతో మిగిలింది. తల్లిదండ్రులతో పాటు తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, చెల్లెలు చనిపోవడంతో పాప అనాథగా మారింది. ఘటనాస్థలిలో గాయపడిన ఆ బాలికను స్థానికులు గుర్తించి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రత్యేక చొరవతో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

Head Constable Suspicious Death: అనుమానాస్పదస్థితిలో హెడ్ కానిస్టేబుల్ మృతి

Last Updated : Dec 6, 2021, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details