Sankranti festival celebrations over in Srikakulam, Palnadu districts: సంక్రాంతి పండుగ సందర్భంగా సిక్కోలు జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామంలో నిర్వహించిన గ్రామీణ క్రీడలు అట్టహాసంగా జరిగాయి. హిందూ సాంసృతిక సాంప్రదాయ పద్దతిలో తమిళనాడులో జరిగే జల్లికట్టు రీతిలో కోడెబళ్ళు పందేలను గ్రామ పెద్దలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పురాతన పల్లె సంస్కృతిని ప్రతీ ఏటా కనుమ రోజున రైతులు వేడుకగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. సంబరాలు అంబరాన్ని తాకేలా క్రీడలు జరుపుకున్నారు. ప్రతిసారి ఎటువంటి రక్తపాతం, గొడవలు జరగకుండా గ్రామస్థులే అన్ని ఏర్పాట్లను చూసుకుంటారు. సిక్కోలు జిల్లా ఖాదీ చేనేతకు ప్రసిద్ధి గాంచిన పొందూరు మండలం లోలుగు గ్రామంలో లోలుగు కాంతారావు ఆధ్వర్యంలో జల్లికట్టు లాంటి క్రీడను నిర్వహించారు.
ఇక్కడ దీన్ని 'కోడెబళ్ళు పందేరం' అని పేరుతో పిలుచుకుంటారు. రైతులు తమ ఇళ్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఎద్దులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. పాడిపంటలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పూజించారు. అనంతరం కాలికి ఎద్దులను కట్టి ముందుగా పొలం దున్నుతారు. తరువాత కోడెబళ్ళు పందేరానికి తీసుకువస్తారు. దీన్ని చూసెందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తొలుత ఈ పందెరానికి నాగలి పూని దానికి పూజలు చేస్తారు. ముందు యువకులు పరిగెడుతుంటే వారి వెనుక ఎద్దులు పరుగులు తీస్తాయి. దైర్యం ఉన్న యువత ఎద్దులను రెచ్చగొడుతూ వాటి కంటే వేగంగా పరిగెడతారు.