Srikakulam Salt Farmers Problems: శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, గార మండలాలు ఉప్పుసాగుకు అనుకూలమైన ప్రాంతాలు. సంతబొమ్మాళి మండలం నౌపడ పరిసరాల్లో సుమారు 15వందల ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది. గత రెండేళ్లుగా ఇక్కడ పండించే ఉప్పుకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో.. రైతులు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేశారు. కష్టానికి తగ్గట్టుగానే పంట కూడా బాగా చేతికందింది. తీరా అంతా బాగుందనుకున్న సమయంలో కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వానల కారణంగా ఉప్పు మడుల్లోకి నీరు చేరి పండిన ఉప్పంతా కరిగిపోయింది. చాలాచోట్ల ఉప్పుమడుగు వేసిన గట్లు కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్చి, ఏప్రిల్‌లో కురిసిన వర్షాలకే రైతు సగం నష్టపోగా.. తాజా వానలతో నిండా మునిగిపోయారు.
గతంలో ఎకరాకు 10 వేల రూపాయల పెట్టుబడి పెడితే.. 50వేలు వరకు లాభం వచ్చేదని ఉప్పు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం లాభాలు కాదుకదా.. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడంలేదని వాపోతున్నారు. ప్రస్తుతం మొదటి రకం ఉప్పు బస్తా ధర మార్కెట్‌లో 250 రూపాయల వరకు ఉండగా.. వర్షాల కారణంగా పాడైపోయిన ఉప్పు 100 రూపాయలకే అమ్ముడు అవుతోందని రైతులు తెలిపారు. ఉప్పు బస్తాలు నిల్వ చేసేందుకు గోదాములు లేక తీవ్రంగా నష్టపోతున్నారని.. ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రభుత్వం గోదాములు నిర్మించాలని కోరుకుంటున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన ఉప్పు రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.