DAMAGED ROADS IN SRIKAKULAM: "ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది. కారణం సంస్కరణలను అర్థం చేసుకోలేకపోవటం.. ఏదైనా ఒకేసారి అయిపోదు. ముఖ్యంగా మూడు సంవత్సరాలలోనే అయిపోదు. రోడ్లు కన్నాలు పూడ్చటం పూర్తైంది. గత మూడు సంవత్సరాల క్రితం వరకు ఉన్నది తెదేపా ప్రభుత్వమే కదా. మరీ ఇన్ని కన్నాలు ఏలా ఏర్పడ్డాయి. అవన్నీ మేము ఏర్పాటు చేసిన కన్నాలా.. అవి గతంలో ఉన్నవే కదా.. కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా అయి ఉంటాయి.. పని చేయటం జరుగుతుంది. రోడ్లు వేయటం జరుగుతుంది.. నియోజకవర్గంలో ఏక్కడైనా కన్నాలు ఉన్న రోడ్లుంటే చూపించండి" ఇవి శ్రీకాకుళం నియోజకవర్గంలో రోడ్ల గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటల గారడీ. కానీ, పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లు. అన్నింటి పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది.
శ్రీకాకుళం పరిధిలోని కోళ్లపేట గార రోడ్డు కచ్చ రోడ్లలాగా మారిపోయాయి. ఇంతకముందు ఇది రోడ్డు అంటే నమ్మలేనంతగా తయారయ్యాయి. అసలు రోడ్డు అనడానికి వీల్లేనంత దారుణంగా దెబ్బతిని పూర్తిగా కంకర తేలిన మార్గంలో ప్రయాణం అంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోడ్డు గురించి జనం ఏమంటున్నారో వారి మాటల్లోనే.
"రోడ్డు పైన కంకర తేలి ఇబ్బందిగా ఉంది. కిందపడిపోయే ప్రమాదం ఉంది. కొంచెం వాన పడినా ఈ మార్గంలో రావటానికి కష్టంగా ఉంది. వేరే మార్గాల గుండా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వాహనాల టైర్లకు రాళ్లు గుచ్చుకుని దెబ్బతింటున్నాయి. ద్విచక్ర వాహనాల వెనుక కూర్చున్నవారు కిందపడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు."-రామారావు, కోళ్లపేట
తండేవలస-సింగపురం రోడ్డు పరిస్థితి మరింత దారుణం. ఈ మార్గంలో కనీసం కంకర కూడా లేదు. పెద్దపెద్ద గోతులు, దుమ్ము-ధూళి తప్ప.. వాహనాల రాకపోకలకు ఏమాత్రం అనువుగా లేదు. ఇలాంటి చోట వర్షం వచ్చిందంటే ఆ బాధ చెప్పలేనిది అని స్థానికుల మూకుమ్మడి అభిప్రాయం.
"సింగపురం నుంచి తండేవలస వెళ్లే రోడ్డు బాగాలేదు. ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా కనీసం పట్టించుకోవటం లేదు. ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయి. వర్షం పడితే మొత్తం బురదతో నిండి ఉంటుంది." -పాపారావు, తండేవలస